ఆస్తిపన్ను చెల్లించకుంటే ఆస్తులు జప్తు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:53 AM
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారి ఆస్తులను మున్సిపల్ చట్టాల ప్రకారం జప్తు చేస్తామని మున్సిపల్ కమిషనర్ హెచఎం స్పందన హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ స్పందన
జగిత్యాల టౌన, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారి ఆస్తులను మున్సిపల్ చట్టాల ప్రకారం జప్తు చేస్తామని మున్సిపల్ కమిషనర్ హెచఎం స్పందన హెచ్చరించారు. ఈ మేరకు మున్సిపల్‌కు బకాయిపడిన ఆస్తి పన్ను చెల్లించాలని లేదంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ మున్సిపల్ వాహనాలకు మైక్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆస్తి పన్ను ప్రధాన ఆదాయ వనరు అని, ఈ నిధుల ద్వారానే పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు వంటి మౌలిక వసతులు మెరుగుపడుతాయన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రస్తుతం భారీ స్థాయిలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నప్పటికి కొందరు ప్రజలు పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, అలాంటి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికి స్పందించకుంటే మున్సిపల్ చట్ట ప్రకారం వారి ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్తుల జప్తుకోసం ఇప్పటికే ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశామని, సంబంధిత ఆస్తి యజమానులు సహకరించాలని కోరారు. బకాయిలు ఉన్న ఆస్తి యజమానులు తక్షణమే తమ పన్ను బకాయిలను చెల్లించి, జరిమానాలు, జప్తు వంటి కఠిన చర్యలకు మున్సిపల్ అధికారులు వెళ్లకుండా సహకరించాలని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఆస్తి పన్నును సమయానికి చెల్లించి మున్సిపాలిటికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.