Share News

నేటి నుంచి ఆషాఢం

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:10 AM

ఆషాఢ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. గురు మౌఢ్యం కూడా బుధవారం ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది.

నేటి నుంచి ఆషాఢం

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. గురు మౌఢ్యం కూడా బుధవారం ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. ఆగస్టు 13 వరకు శుభ ముహూరాలు లేవు. బోనాల జాతరను ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసంలోనే కొన్ని చోట్ల బోనాల జాతరలు ప్రారంభం కాగా ఆషాఢమాసంలో విరివిగా గ్రామ, కుల దేవతలకు వివిధ వర్గాల ప్రజలు బోనాలు సమర్పిస్తారు. ఈ యేడు అధిక, నిజ జ్యేష్ఠ మాసాలు రాగా మంగళవారం నిజ జ్యేష్ఠ అమావాస్య. ఆగస్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో శుభ ముహూర్తాలున్నాయి.

ఫ ఆషాఢమాసం విశిష్టత....

ముహూర్తాలకు పనికిరాని మాసమైనా ఆషాఢం విశిష్టతను సంతరించుకుంది. శ్రావణానికి ముందు పూజలు, పండుగలు ప్రారంభమయ్యే మాసమిదే! ఈ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి తిరగడంతో సూర్య రశ్మి కొంత తగ్గి వాతావరణంలో కొంత మార్పు ఏర్పడి అనేక వ్యాధులు ప్రబలుతాయి. ఆ వ్యాధుల నుంచి తమ కుటుంబాన్ని కాపాడి చల్లగా చూడమని వేడుకుంటూ బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితి. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి విష్ణువు యోగ నిద్రతోపాటు సకల దేవతలు నిద్రను ప్రారంభిస్తారు. అందుకే ముహూర్తాలు ఉండవు. ఇదే రోజు నుంచి నాలుగు నెలల పాటు పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు. ఆడవారు ఈ మాసంలో గోరింటాకు తప్పక ధరిస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడవారు తల్లిగారింటికి వెళ్లడం ఆనవాయితి. పురుషులు పొలం పనులు ప్రారంభిస్తారు. అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి అలంకారాలు చేస్తారు. పురాణాల్లో చెప్పినట్లు జ్యేష్ఠ అమావాస్య నాడు పూర్వీకుల స్మరణలో భాగంగా నదీ స్నానాలు, పిండప్రదానాలు, తర్పణాలు అర్పిస్తారు.

ఫ బోనాల ప్రాధాన్యం

బోనాలు అమ్మవారిని (శక్తి స్వరూపిణి) పూజించే పండుగ. సంస్కృతిలో ఒక భాగం. అమ్మవారిని ఆడబిడ్డగా భావించి అత్తవారింటి నుంచి తీసువచ్చి బోనం, చీర, సారె సమర్పించి తిరిగి అత్తవారింటికి పంపడమే బోనాల జాతరగా అభివర్ణిస్తారు. మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మకు, మధ్య రోజుల్లో ఇతర దేవతలకు బోనాలు, పసుపు, కుంకుమలు, వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పిస్తారు.

Updated Date - Jul 15 , 2026 | 12:10 AM