కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:23 AM
ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్
పెద్దపల్లి టౌన్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వర్కర్లు నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జి. జ్యోతి, ఏ.స్వరూప మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. 21 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. కనీస వేతనంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ 15 నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో శోభారాణి, శారద, అమృత, ప్రేమలత, మల్లీశ్వరి, మంజుల, మమత, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.