Share News

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదుట ఆశావర్కర్ల నిరసన

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:51 AM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదుట ఆశావర్కర్ల నిరసన
ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఆశావర్కర్లు

- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ధర్మపురి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని అనేక మంది ఆశావర్కర్లు ఉదయం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు లోపలికి ప్రవేశించి కార్యాలయం ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం ఆశావర్కర్లు, జిల్లా నాయకులు మాట్లాడుతూ ఆశావర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలన్నారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎనహెచఎంకు సరిపడా నిధులు కేటాయించాలని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని కోరారు. గ్యారెంటీ ఫిక్సిడ్‌ వేతనం కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదని అన్నారు. ఆశావర్కర్స్‌కు కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 రూపాయల పారితోషికం వెంటనే అమలు చేయాలని కోరారు. ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐ మహేష్‌, సతీష్‌, పోలీస్‌ సిబ్బంది చేరుకుని ఆశావర్కర్స్‌ను ధర్నా విరమించాలని కోరారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా ఓఎస్‌డీతో ఫోన ద్వారా మాట్లాడారు. ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ఆశావర్కర్లకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు ఆత్మకూరి లత, జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్టు మమత, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇదునూరి సులోచన, జిల్లా కార్యదర్శి శ్రీకాంత, ఆశావర్కర్లు జిల్లా కార్యదర్శి రాయికంటి దివ్య, జిల్లా సహాయకురాలు మామిడిపల్లి జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రేమలత, యశోద, పద్మ, లక్ష్మి, లత, స్వప్న, భారీ సంఖ్యలో ఆశావర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:51 AM