Share News

బాధితులకు బాసటగా..

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:54 AM

పోలీసు శాఖ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సంస్కరణలు చేపడుతోంది.

బాధితులకు బాసటగా..

జగిత్యాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సంస్కరణలు చేపడుతోంది. ఫిర్యాదుదారులకు సులభంగా, నాణ్యమైన సేవలు అందేలా రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై పలు కేసుల్లో స్టేషన్‌కు వెళ్లకుండానే సంఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్‌కుమార్‌ పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఫసమాచారం అందిన వెంటనే...

ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ విధానం ద్వారా బాధితుల వద్దకే పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులు సమాచారం ఇచ్చినా, డయల్‌ 100 ద్వారా ఫిర్యాదు చేసినా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేస్తారు.

ఫప్రధానంగా ఏడు అంశాలపై..

మహిళలపై వేధింపులు, వృద్ధులకు జరిగే అన్యాయం, మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, తెలంగాణ ర్యాగింగ్‌ నిషేధ చట్టం వంటి ప్రత్యేక చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలకు సంబంధించి గాయాలైతే బాధితులను ఆసుపత్రికి తరలిస్తారు. ఈవిధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యభర్తల పంచాయితీలు, వేధింపులు, అనుమానాస్పద మృతి వంటి వాటిపై అప్పటికప్పుడే కేసులు నమోదు చేస్తారు. జిల్లాలో 15 రోజులుగా కార్యక్రమం కింద ఉద్యోగులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఫఎలా పనిచేస్తుంది..?

పోలీసు సిబ్బంది వద్ద టాబ్లెట్‌లో మొబైల్‌ యాప్‌ ఉంటుంది. బాధితుడు, సాక్షి ఇచ్చిన వివరాలు అక్కడికక్కడే నమోదు చేసి డిజిటల్‌ సంతకం తీసుకోవడం ద్వారా వెంటనే సెంట్రల్‌ సర్వర్‌కు డేటా పంపించడం జరుగుతుంది. ఎఫ్‌ఐఆర్‌ నంబరు తక్షణమే జనరేట్‌ అవుతుంది. అదే సమయంలో నేరం జరిగిన ప్రదేశం, ఆధారాలను భద్రపరుస్తారు. ఎఫ్‌ఐఆర్‌ను బాధితుడికి ఈ మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా అందజేస్తారు. అవసరమైతే హార్ట్‌ కాపీ అందిస్తారు.

ఫఎక్కడ ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడే ఎఫ్‌ఐఆర్‌..

నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఈ క్రమంలో వారిని తిరిగి పోలీసు స్టేషన్‌కు పిలిచి సమయం వృథా చేయకుండా భరోసా కల్పించాలనే ఉద్ధేశంతో ఈ విధానాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలంలో సేకరించిన వివరాలను ఎస్‌హెచ్‌వో ద్రువీకరించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ చేసి, ఆ తర్వాత బాధితులకు వాట్సప్‌లో పంపిస్తారు. దర్యాప్తులో పురోగతి ఆధారంగా ఫిర్యాదుదారులకు సమాచారం అందిస్తారు. బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా చర్యలు చేపడుతారు. ముఖ్యంగా మహిళలకు ఈవిధానం ఎంతగానో ఉప యుక్తంగా ఉంటుంది. బాలికలు, యువతులు మహిళలు అదృశ్య మైనప్పుడు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ కార్యక్రమం ద్వారా ఉపయుక్తంగా ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.

బాధితులకు ప్రయోజనకరంగా ఉంటుంది

-అశోక్‌ కుమార్‌, ఎస్పీ

బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో భాగంగా ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ను అమలులోకి తీసుకొచ్చాము. బాధితులు డయల్‌ 100 స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. వాంగ్మూలం రికార్డు చేయడం జరుగుతుంది. దీంతో బాధితులకు సమయం ఆదా అయి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇటీవల నమోదైన కేసులు

ఫ సారంగాపూర్‌ మండలం రంగపేటలో ఈనెల 10న బస్టాండు వద్ద బస్సు కోసం వేచి ఉన్న ఓ బాలికను ఓ ఆటో అతివేగంగా అదుపుతప్పి వచ్చి ఢీకొంది. సంఘటనలో బాలికకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితురాలి తండ్రి పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి బందువులు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదును స్వీకరించి అక్కడే ఆటో డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఫ ధర్మపురి మున్సిపాలిటీకి చెందిన 21 సంవత్సరాల వివాహితపై ఆమె భర్త కుటుంబ తగాదాలతో పెట్రోలు పోసి నిప్పటించాడు. సంఘటనలో వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వివాహితను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలన జరపడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడిక్కడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేస్తున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:54 AM