వన మహోత్సవానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:04 AM
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేపడుతున్న వన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
జగిత్యాల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేపడుతున్న వన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షి స్తున్నారు. వానలు ప్రారంభం కాగానే నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటేందుకు అధికారులు, గ్రామ పంచాయతీల సిబ్బంది ప్రణాళికలు ఖరారు చేశారు. ఈనెల 18న ధర్మపురి మండలం తుమ్మెనాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌లు లాంఛనంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఫఒక్కో నర్సరీలో 8 వేల మొక్కల పెంపకం..
జిల్లాలోని 327 నర్సరీలు ఏర్పాటు చేసిన సుమారు 42 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో నర్సరీలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్‌లో మొక్కలు నాటి రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తున్నారు. ఈ యేడాది జనవరి నుంచే ఉపాధిహామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి ఎండల తీవ్రత అధికంగా ఉన్నా నర్సరీల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మొక్కలను ఎండదెబ్బ నుంచి కాపాడగలిగారు. ప్రస్తుతం ఒక్కో నర్సరీలో 5 వేల నుంచి 8 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు.
ఫఇంటింటికీ పంపిణీకి నిర్ణయం
జూన్, జూలైలో పెద్దఎత్తున మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాల్వల గట్ల వెంట, గుట్టలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఇంటికి ఐదు నుంచి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు నిర్ణయించారు. ఈ సారి నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కల పెంపకానికి అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు.
ఫవివిధ శాఖల వారీగా లక్ష్యం...
జిల్లా వ్యాప్తంగా 41లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వివిధ శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్ణయించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో 5.80 లక్షల మొక్కలు, రహదారులు భవనాలు శాఖ ఆధ్వర్యంలో 50 వేలు, ఆర్‌డబ్ల్యూఎస్ 31 లక్షలు, పోలీసు శాఖ 50 వేలు, వైద్య ఆరోగ్య శాఖ వెయ్యి, నీటి పారుదల శాఖ 20 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యానవన శాఖ 30 వేలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 1.24, ఎక్సైజ్ శాఖ 20 వేలు, దేవాదాయ శాఖ వెయ్యి, గ్రామీణాభివృద్ధి శాఖ 31 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ 1.80లక్షలు, విద్యాశాఖ 20 వేలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 1.20 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ట్రాన్స్‌కో శాఖ 5 వేలు, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ 5 వేలు, మైన్స్ అండ్ డెవలప్‌మెంట్ 5 వేలు, యూత్ అండ్ స్పోర్ట్ 5 వేలు, సివిల్ సప్లయి శాఖ 5 వేలు చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించారు.
ఫఅధికారులకు బాధ్యతలు అప్పగింత...
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో వన మహోత్సవానికి అధికారులు సిద్ధమయ్యారు. గతంలో మాదిరిగానే మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు, ఐదు మున్సిపాలిటీలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగులకు లక్ష్యాలను సాధించేలా దిశా నిర్దేశం చేశారు. వర్షాలు పడేలోగా ఉపాధి కూలీలతో గుంతలు తీయించేందుకు సిద్ధమవుతున్నారు. అందుబాటులో ఉన్న నర్సరీల్లో సంరక్షణ బాద్యతలు నిర్వహిస్తునే కొత్తగా అవెన్యూ ప్లాంటేషన్ సమా ఇతర ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తున్నారు.
లక్ష్యం మేరకు మొక్కలు నాటుతాం...
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో వర్షాలు పడగానే మొక్కలు నాటుతాం. ముందుగా గుంతలు తీసే పనులను ప్రారంభిస్తాం. అనుకూల వాతావరణం ఉంటే వెంటనే మొక్కలను నాటుతాం. వివిధ గ్రామ పంచాయతీల్లో అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో అటవీ సంపదను కాపాడుకోవాలి. సామాజిక అడవులను పెంచాలి. ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉంటేనే పర్యావరణ పరిరక్షణ చేసిన వారమవుతాం.