Share News

బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేపట్టాలి

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:31 AM

బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడికి యత్నించాయి.

బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేపట్టాలి

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడికి యత్నించాయి. శుక్రవారం బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి, నగరపాలక సంస్థ అధికారులకు, పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బీఆర్‌ఎస్‌ శ్రేణులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ, దసరా, ఉగాది పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందన్నారు. పండుగల నిర్వహణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. పండుగ సమీపించిన తర్వాత టెండర్లు నిర్వహించడం నగరపాలక సంస్థ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. వీధి దీపాలు సరిగా వెలగకపోతే మహిళలు చీకట్లోనే బతుకమ్మ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై కలెక్టర్‌ చొరవ తీసుకుని పూర్తి చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌ గౌడ్‌ , కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ , జమ్మూ , యూసుఫ్‌, నలువాల రవీందర్‌ పటేల్‌, గాదె రూపా శ్రీనివాస్‌, ప్రదీప్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేష్‌, జంగిలి ఐలేండర్‌ యాదవ్‌, ఎడ్ల సరిత అశోక్‌ , సోనూసింగ్‌, కర్ర సూర్యశేఖర్‌, గంటల రేణుక తదితరులు పాల్గొన్నారు

Updated Date - Oct 10 , 2026 | 12:31 AM