ఎలకి్ట్రక్ బస్సులు భద్రమేనా..?
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:48 AM
ఆర్టీసీ ఎలకి్ట్రక్ బస్సులు భయపెడుతున్నాయ్... వరుస ఘటనలతో ప్రయాణీకులు, ఆర్టీసీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
కరీంనగర్ క్రైం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఎలకి్ట్రక్ బస్సులు భయపెడుతున్నాయ్... వరుస ఘటనలతో ప్రయాణీకులు, ఆర్టీసీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలకి్ట్రక్ బస్సుల్లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో, ప్రజల్లో, ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం అలుగునూర్ సమీపంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఎలకి్ట్రక్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలల్లోనే బ్యాటరీల నుంచి పొగలు వచ్చి నిమిషాల్లో వ్యాపించి లక్షల రూపాయల విలువైన బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా ప్రయాణికులను కాపాడాడు.
ఫ 10 రోజుల వ్యవధిలో..
ఈ ఘటన జరిగిన 10 రోజుల్లోనే బుధవారం వేకువజామున కరీంనగర్ టూ డిపోలో చార్జింగ్ పెట్టిన సమయంలోనే ఎలకి్ట్రక్ బస్సు బ్యాటరీల వద్ద మంటలు చెలరేగాయి. సిబ్బంది గమనించి ఫైర్‌స్టేషనకు సమాచారం ఇవ్వగా గంటకుపైగా కష్టపడి మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సుకు భారీగా నష్టం వాటిల్లింది. కొన్ని నెలల క్రితం ఇదే డిపోలో ఒక ఈవీ బస్సు బ్యాటరీ చార్జింగ్ సమయంలోనే మంటలు చెలరేగగా అగ్నమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కొంత కాలంగా కరీంనగర్-2 డిపోకు చెందిన ఈవీ బస్సులు ప్రయాణ సమయంలోనే మొరాయిస్తున్నాయి. బుధవారం రాజన్నసిరిసిల్ల బస్టాండ్‌లో ఒక ఈవీ బస్సు ఇంజన మొరాయించి నిలిచిపోయింది. 10 రోజుల క్రితం గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈవీ బస్సు తెలంగాణ చౌక్ వద్ద నిలిచిపోయింది. ఇటువంటి ఘటనలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ వరుస సంఘటనలతో ఎలకి్ట్రక్ బస్సుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదాలకు బ్యాటరీ లోపాలు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ కరీంనగర్ డిపో-2లో 104 ఈవీ బస్సుల నిలిపివేత
వరుస ఘటనల నేపథ్యంలో కరీంనగర్ టూ డిపోలో 104 ఎలకి్ట్రక్ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. జేబీఎం సంస్థ బస్సుల నిర్వహణ, భద్రతపై హామీ ఇచ్చిన తరువాతనే ఈవీ బస్సులను నడపుతామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈవీ బస్సులు హఠాత్తుగా నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. తిమ్మాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోతే భారీ నష్టం జరిగేది.
ఫ జేబీఎం సంస్థ ఆధ్వర్యంలో..
ఆర్టీసీ సంస్థకు కరీంనగర్ రీజియనలో 11 డిపోలు ఉండగా, ఇందులో కరీంనగర్ డిపో-2కు 104 ఎలకి్ట్రక్ బస్సులను నడిపేందుకు అనుమతించారు. ఈ ఎలకి్ట్రక్ బస్సులను జేబీఎం సంస్థ నిర్వహిస్తోంది. ఆర్టీసీ రూట్‌లను ఖరారు చేయడం, బ్యాటరీల చార్జింగ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాన్ని మాత్రమే కల్పించింది. మిగతా వ్యవహారాలైన డ్రైవర్లు బస్సుల నిర్వహణ, టికెట్‌ల జారీ, తదితర అన్ని రకాల నిర్వహణ బాధ్యత జేబీఎం సంస్థదే. ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ ఎలకి్ట్రక్ బస్సులని కొనుగోలు చేయడంలో చూపించిన శ్రద్ధ, వాటి బ్యాటరీల నిర్వహణ, నాణ్యతలో, బస్సులో సేఫ్టీ ప్రమాణాలపై చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.