Share News

మరో ‘షాక్‌’..

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:52 AM

పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను సూపర్‌ ఎల్‌నినో విపత్తు తలకిందులు చేసింది.

మరో ‘షాక్‌’..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను సూపర్‌ ఎల్‌నినో విపత్తు తలకిందులు చేసింది. నిత్యావసరాల సరుకుల ధరలు భగ్గుమని మండుతుంటే విద్యుత్‌ వినియోగదారులకు నవంబరు మాసం నుంచి మరో షాక్‌ తగలనుంది. ఎన్పీడీసీఎల్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్‌ పరిధిలో ఇప్పటికే విద్యుత్‌ బిల్లుల్లో వివిధ చార్జీలు అదనంగా వసూలు చేస్తుండగా, తాజాగా ట్రూ-అప్‌ చార్జీలు కూడా వినియోదారులపై మరింత భారాన్ని మోపనుంది. 26 నెలల్లో జిల్లా వినియోగదారుల నుంచి సుమారుగా రూ.250 కోట్ల వరకు వసూలు చేయనున్నారు. తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ట్రూ-అప్‌ చార్జీల వసూలుకు అనుమతి ఇవ్వడంతో నవంబరు మాసం నుంచి 26 నెలల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. 2022-23 సంవత్సరంలో విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చు, 2024-24లో ఏర్పడిన రెవెన్యూ లోటును కలిపి రూ.7635.22 కోట్లను ట్రూ-అప్‌ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి డిస్కములకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం వ్యవసాయేతర కనెక్షన్ల నుంచి నవంబరు మాసంలో యూనిట్‌పై 0.30 పైసలు, డిసెంబరు నుంచి 0.50 పైసలు ట్రూ-అప్‌ చార్జీల రూపంలో డిసెంబరు 2028 వరకు 26 నెలల పాటు వసూలు చేయనున్నారు.

జిల్లాపై ప్రతినెలా సుమారు రూ.9.75 కోట్ల భారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 3,10,810 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ అవసరాలకు సంబంధించి డొమెస్టిక్‌ కనెక్షన్లు 1,91,098 ఉండగా, కమర్షియల్‌ కనెక్షన్లు 24,670, పరిశ్రమలు కనెక్షన్లు 2,666, పవర్‌లూమ్‌, కుటీర పరిశ్రమల కనెక్షన్లు 4,449, వ్యవసాయ కనెక్షన్లు 82,421, మున్సిపల్‌, గ్రామ పంచాయతీల కనెక్షన్లు 3,947,పాఠశాలలు, దేవస్థానాల కనెక్షన్లు 1,423, పారిశ్రామిక కనెక్షన్లు 88 ఉన్నాయి. ఇందులో వ్యవసాయేతర కనెక్షన్ల బిల్లులపైన ట్రూ-అప్‌ చార్జీలు వసూలు చేస్తారు. జిల్లాలో సెప్టెంబరు మాసంలో 168 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కోటా కేటాయించగా 195 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం జరిగింది. దీని ప్రకారం విద్యుత్‌ యూనిట్లలో 19.50 కోట్ల యూనిట్లు వాడకం అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే నవంబరు మాసంలో జిల్లా వినియోగదారులపై ట్రూ-అప్‌ చార్జీలు యూనిట్‌కు 0.30 పైసల అదనపు బారం రూ.5.85 కోట్లు, డిసెంబరు నుంచి 0.50పైసల చొప్పున రూ.9.75కోట్ల భారం పడుతుంది. ఇలా 26 నెలలు జిల్లాలోని వినియోగదారుల నుంచి సుమారుగా రూ.250 కోట్ల పైన వసూలు చేస్తారు. ఒక వినియోగదారుడు నవంబరు నెలలో 250 యూనిట్లు వాడితే 0.30 పైసలు యూనిట్‌పై అదనంగా అంటే రూ.75, డిసెంబరు నుంచి 0.50 పైసలు చొప్పున అదనంగా రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే అదనపు చార్జీల భారం

జిల్లా ఇప్పటికే ఎన్పీడీసీఎల్‌ కరెంట్‌ బిల్లులో నానా రకాలుగా ఛార్జీలు వేసి వినియోగదారుడి నుంచి వసూలు చేస్తోంది. ఒక వినియోగదారుడికి రూ.1406 బిల్లు వస్తే అందులో వాడుకున్న కరెంటుకు చార్జ్‌ రూ.1271.80 ఉంటుంది. ఫిక్స్‌డ్డ్‌ చార్జీల పేరుతో రూ.20, కస్టమర్‌ చార్జీల పేరుతో మరో రూ.100, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.13.80, లాస్‌, గేయిన్‌ అంటూ మరో 0.40పైసలు వసూలు చేస్తున్నారు. నవంబరు నుంచి ట్రూ-అప్‌ చార్జి పేరుతో మరింత భారం పెరుగుతుంది. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉంది. దీంతో యూనిట్లు కూడా పెరగడం దానికి తోడుగా ట్రూ-అప్‌ చార్జి కూడా పడటంతో వ్యాపారులు, పేద మధ్య తరగతి కుటుంబాలకు ప్రజలకు భారంగా మారుతుంది.

Updated Date - Oct 30 , 2026 | 12:52 AM