అంగన్‌వాడీ సేవలు మరింత స్మార్ట్
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:01 AM
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది.
జగిత్యాల, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది. క్షేత్ర స్థాయిలో మాతా శిశు సంరక్షణ కోసం శ్రమిస్తున్న టీచర్ల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్నేళ్లుగా పాత తరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న సిబ్బందికి స్మార్ట్ ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్‌లు ఈ ఫోన్లు అందించారు.
ఫజిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో జగిత్యాల ప్రాజెక్టులో 307 కేంద్రాలు, ధర్మపురిలో 219 కేంద్రాలు, మల్యాలలో 227 కేంద్రాలు, మెట్‌పల్లిలో 312 కేంద్రాలున్నాయి. ధర్మపురి ప్రాజెక్టు పరిధిలో 9 మంది సూపర్‌వైజర్లు, జగిత్యాల ప్రాజెక్టులో 12మంది, మల్యాల ప్రాజెక్టులో 8 మంది, మెట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో 13 మంది సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు. వీరికి తోడు ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో బ్లాక్ కో ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. వీటిల్లో సుమారు 14,086 మంది గర్భిణులు, బాలింతలు, 34,897 మంది ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సులోపు చిన్నారులు, 15,907 మంది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఫ992 స్మార్ట్ ఫోన్లు పంపిణీ..
జిల్లాలోని మెట్‌పల్లి, ధర్మపురి, జగిత్యాల, మల్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 992 సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఇందులో జగిత్యాల ప్రాజెక్టు పరిధిలో 199 స్మార్ట్ ఫోన్లు, జగత్యాలలో 285 ఫోన్లు, మల్యాలలో 212 ఫోన్లు, మెట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో 296 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అదేవిదంగా జిల్లాలో 41 మంది ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు, ఇరువురు ఐసీడీఎస్ ప్రాజెక్టు బ్లాక్ కో ఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందించారు. 2021 సంవత్సరంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ‘పోషణ్ ట్రాకర్’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడం, డిస్‌ప్లేలు పగిలిపోవడంతో అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో వెనుకబడ్డారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లో ఇటీవల అంగన్ వాడీ సిబ్బందికి నూతన ఫోన్లను పంపిణీ చేశారు.
ఫమూడు నెలలకోసారి ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు..
అంగన్‌వాడీ కేంద్రాల్లోని మూడు నెలల నుంచి ఆరు ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14 నుంచి 18 ఏళ్ల కిషోర బాలికలకు ప్రతి నెలా ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ గుర్తింపు) హాజరు తీసుకుంటారు. దీనికోసం కొత్త ఫోన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రపంచం 5జీ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో మళ్లీ 4జీ ఫోన్లే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త సెల్‌టవర్లు 5జీ నెట్‌వర్క్ అందిస్తున్న వేళ, 4జీ ఫోన్లతో భవిష్యత్తులో మళ్లీ పాత సమస్యలు పునరావృతం కావచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ఫపకడ్బందీగా పర్యవేక్షణ
తాజాగా 4జీ సాంకేతికతతో కూడిన ఫోన్లు అందడంతో అంగన్‌వాడీ సేవలు వేగవంతం కానున్నాయి. ప్రతీ రోజూ యాప్‌లో లబ్ధిదారులకు సంబంధించిన 14 రకాల రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పకడ్బందీగా జరగనుంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార వివరాలు, చిన్నారులకు బోధించే పాఠాలు, వైద్య పరీక్షల సమాచారం, కమ్యూనిటీ బేస్ట్ ఈవెంట్స్, పోషణ్ దివస్, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషియన్ సెషన్ వంటి కార్యక్రమాల వివరాలు, అంగన్‌వాడీ కేంద్రాల స్థితిగతులు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలు, మరమ్మతుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం
-నజీమా బేగం, అంగన్‌వాడీ టీచర్, మెట్‌పల్లి
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్, ప్రాజెక్టు బ్లాక్ కో ఆర్డినేటర్లకు 4జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం వల్ల పనులు మరింత వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. ప్రతీ నెల వివిధ యాప్‌లలో మాతా శిశు సంరక్షణ వివరాలను వేగవంతంగా నమోదు చేయడానికి వెసులుబాటు లభించింది. ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం సంతోషకరం.
సద్వినియోగం చేసుకోవాలి
-రాజ్‌కుమార్, జిల్లా సంక్షేమాధికారి
గతంలో పాత ఫోన్లతో అంగన్‌వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అందించిన స్మార్ట్ ఫోన్ల ద్వారా 14 రిజిస్టర్ల వివరాలను యాప్‌లలో సకాలంలో నమోదు చేయనున్నారు. వీటిని కేవలం విధి నిర్వహణకే వినియోగించాల్సి ఉంటుంది. రికార్డుల నమోదులో జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలి.