Share News

అంగన్‌ వాడీ సరుకులు ఇంటికే...

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:45 PM

ఎండలు మండుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు బయటకువచ్చేందుకు జంకుతున్నారు. వేసవి కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరు శాతం తగ్గింది.

అంగన్‌ వాడీ సరుకులు ఇంటికే...
చెర్లబూత్కూర్‌ అంగన్‌వాడీ కేంద్రలో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న అంగన్‌వాడీ టీచర్‌

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు బయటకువచ్చేందుకు జంకుతున్నారు. వేసవి కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరు శాతం తగ్గింది. గర్భిణిలు, బాలింతలు తప్ప అంగన్‌వాడీ కేంద్రాలకు ఎవ్వరూ రావడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం లబ్ధిదారులకు అంగన్‌ వాడీ సరులును ఇంటికే పంపించాలని నిర్ణయించింది. మే 1 నుంచి 31వ తేది వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జూన్‌ 1 నుంచి యథావిధిగా కేంద్రాలను ప్రారంబించనున్నారు. కరీంనగర్‌ అర్బన్‌ పరదిలో 107, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 19 అంగన్‌ వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతీ రోజు ఉడకబెట్టిన గుడ్లు, బాలామృతం, పాలు, మురుకులు, అన్నం పప్పుతో కూడిన పోషకాహారం అందిస్తారు. ప్రస్తుతం ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రతి మండలంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో మే ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వగా, పోషకాహార లోపం ఉండకూడదనే ఉద్దేశంతో ఇంటికే సరుకులు అందించనున్నారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు 30 గుడ్లు, ఏడు నెలల నుంచి మూడేళ్ల వారికి 16 గుడ్లు, ఆరు లీటర్ల పాలు, మంచి నూనె, కందిపప్పు, బియ్యం, ఇతర సరుకులను అందజేయనున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:45 PM