తీరని స్కూల్ డ్రెస్ ముచ్చట..
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:23 AM
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో అందరికీ ఒకే భావం కల్పించే దిశగా ఒకే రాష్ట్రం.. ఒకే యూనిఫామ్.. విధానం తీసుకొచ్చింది. తొలిరోజే కొత్త డ్రెస్సులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం విద్యార్థులకు ఎదురుచూపులు మిగుల్చుతోంది.
- పాత, రంగుల యూనిఫామ్‌తోనే పాఠశాలకు..
- ఇంకా జిల్లాకు చేరని యూనిఫాం క్లాత్
- యూనిఫాం, విద్యాకిట్ కోసం విద్యార్థుల ఎదురుచూపు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో అందరికీ ఒకే భావం కల్పించే దిశగా ఒకే రాష్ట్రం.. ఒకే యూనిఫామ్.. విధానం తీసుకొచ్చింది. తొలిరోజే కొత్త డ్రెస్సులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం విద్యార్థులకు ఎదురుచూపులు మిగుల్చుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కార్ పాఠశాల్లో విద్యార్థులకు స్కూల్ డ్రెస్ ముచ్చట తీరకపోవడంతో పాత, రంగుల డ్రెస్‌ల్లోనే అక్షర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచిపోయినా ప్రభుత్వం ప్రకటించిన కొత్త యూనిఫామ్‌తో పాటు 21 వస్తువుల ప్రత్యేక విద్యాకిట్ విద్యార్థులకు అందని అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. గతంలో పాఠశాలలను బట్టి వేరువేరు రంగుల్లో యూనిఫాంలు కొనసాగుతున్నాయి. వీటిని ఈసారి ఒకే డ్రెస్ కోడ్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 490, రెండు ప్రభుత్వ పాఠశాలలు, 111 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీ, 7మోడల్ స్కూల్, 314 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 38 మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, మూడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒకటి ఆర్‌బీఎస్, ఒకటి డీఎన్‌టీ పాఠశాలలు ఉన్నాయి. 490 పాఠశాల్లో 41 వేల మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు 18179 మంది. బాలికలు 20450 మంది ఉన్నారు. 21 రెసిడెన్షియల్ పాఠశాలలో 7762 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 2583 మంది, బాలికలు 5179 మంది ఉన్నారు. సకాలంలో యూనిఫామ్ రాకపోవడంతో విద్యార్థులు గత సంవత్సరం యూనిఫామ్‌లతోనే పాఠశాలకు వెళుతున్నారు. కొందరి యూనిఫామ్‌లు పాడైపోవడం, సైజులు మారిపోవడంతో ఇతర డ్రెస్‌లోనే పాఠశాలకు వస్తున్నారు. గతంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి నాలుగు నెలల ముందుగానే యూనిఫామ్ కుట్టడానికి వస్త్రాన్ని జిల్లాలకు సరఫరా చేసేవారు. ఈసారి యూనిఫామ్ వస్త్రం కూడా జిల్లాలకు చేరలేదు. జిల్లాలోని మహిళా సంఘాల ద్వారా ఒక్కో జత రూ.75 చొప్పున చెల్లించి యూనిఫామ్‌లను కుట్టించి సరఫరా చేశారు. ఈ ఏడాది విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు కుట్టడానికి మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే విద్యార్థుల కొలతలు తీసి పెట్టుకున్నా కొత్తగా చేరిన విద్యార్థుల కొలతలు తీసుకోవాల్సి ఉంది. కానీ యూనిఫామ్ క్లాత్ వచ్చేది ఎప్పుడు, వాటిని కుట్టి పంచేది తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు స్వాతంత్య్ర దినోత్సవం నాటికైనా దుస్తులు అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మహిళా సంఘాల సభ్యులు కూడా కుట్టు ద్వారా ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
జాడ లేని విద్యార్థులకు స్కూల్ విద్యా కిట్లు..
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్‌తో పాటు 21 వస్తువులతో కూడిన ప్రత్యేకమైన కిట్లను పాఠశాల ప్రారంభం రోజున అందిస్తామని ప్రకటించినా ఇప్పటికి అందని పరిస్థితి ఉంది. ప్రారంభం రోజున మూడు జతల యూనిఫాం, రెండు చేతుల సాక్సు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్‌బుక్స్, టెస్ట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, జామెంట్రీ బాక్స్, డిక్షనరీ వస్తువులతో పాటు వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ట్రాక్‌సూట్, నైట్‌డ్రెస్ లాంటి దుస్తులతో పాటు బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేట్, గ్లాస్, కప్పు స్పూన్, ట్రంక్ బాక్స్ స్టేషనరీ కిట్‌లాంటి వసతి వస్తువులు అందిస్తామని ప్రకటించారు. దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపశమనం కలిగేలా ఉన్నాయని భావించినా ఇంకా నిరీక్షణ తప్పడం లేదు.