‘గుడ్డు’ సరే.. భోజనమేది..?
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:07 AM
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఇంటర్ విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వస్తున్నారు. లక్షల్లో ఫీజులు చెల్లించలేక పేద కుటుంబాల విద్యార్థులు ఎన్నో కష్టాలకు ఓర్చి దూర భారాన్ని సైతం లెక్కచేయకుండా విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల పౌష్టికాహారం అందించే దిశగా వారంలో మూడు రోజులు ఉడికించే కోడిగుడ్లను అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
- ఇంటర్ విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉడకబెట్టిన కోడిగుడ్లు
- ప్రభుత్వ కళాశాలల్లో త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం
- ఒక్కో గుడ్డుకు రూ.6.. గిట్టుబాటు కాదంటున్న స్వశక్తి సంఘాలు
- అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి ఇంటర్ విద్యార్థుల ఎదురుచూపులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఇంటర్ విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వస్తున్నారు. లక్షల్లో ఫీజులు చెల్లించలేక పేద కుటుంబాల విద్యార్థులు ఎన్నో కష్టాలకు ఓర్చి దూర భారాన్ని సైతం లెక్కచేయకుండా విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల పౌష్టికాహారం అందించే దిశగా వారంలో మూడు రోజులు ఉడికించే కోడిగుడ్లను అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నవంబరు మొదటి వారంలోనే అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు కూడా వచ్చాయి. దీపావళి తర్వాత అమలులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యార్థులకు ఇది ‘గుడ్డు’ న్యూస్ అయినప్పటికీ మధ్యాహ్న భోజనం లేకుండా ఉడకబెట్టిన గుడ్డు ఎలా అందించాలనే సందిగ్ధం ఏర్పడింది. ప్రభుత్వం ఉడకబెట్టిన గుడ్డుకు ఒక్కో దానికి రూ.6 ఇవ్వనట్లు ప్రకటించింది. ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలు, స్వశక్తి సంఘాలకు అప్పగించి పారదర్శకంగా కొనసాగించాలని ప్రభుత్వం భావించింది. కానీ రూ.6 గిట్టుబాటు కాదని వారు ముందుకు రావడంలేదని తెలిసింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.6.50 వరకు ఉందని, ఉడకబెట్టడానికి అదనంగా ఖర్చవుతుందని కనీసం రూ.7 ఇవ్వాలని కోరుతున్నారు.
మధ్యాహ్న భోజనానికి నిరీక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా విద్యార్థులకు మాత్రం ఎదురుచూపులు, నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జిల్లాలోని 260 గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుతున్నారు. ఉదయం లేచి మధ్యాహ్న భోజనం కోసం బాక్సులతో కొన్ని సందర్భాల్లో అల్పాహారం కూడా తినకుండా కళాశాలకు వస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు ఇంకా ప్రారంభించకపోవడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 10 కళాశాలలు.. 2730 మంది విద్యార్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, 2730 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 1594 మంది ఉండగా, బాలికలు 1136 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారే ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేస్తే హాజరు శాతం పెరగడమే కాకుండా చదువు మధ్యలో మానేసే వారి సంఖ్య తగ్గుతుందని విద్యావేత్తలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ కడుపుతో గంటలు తరబడి తరగతిలో కూర్చోవడం వల్ల విద్యార్థులు ఏకాగ్రతను కూడా కోల్పోతున్నారు. పోషకాహారం అందకపోవడంతో అలసట, నీరసం కారణంగా విద్యార్థులు చదువుపై సరైన శ్రద్ధ పెట్టడం లేదని చెబుతున్నారు. దీనివల్ల ఉత్తీర్ణత శాతంపై కూడా ప్రభావం పడుతుంది. రోజువారి కూలి పనులు చేసే కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం కోసం, అల్పాహారం కోసం డబ్బులు ఇవ్వడం భారంగానే ఉంటుందని చెబుతున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలల్లో త్వరగా అమలుచేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య..
ప్రభుత్వ కళాశాల బాలురు బాలికలు మొత్తం
సిరిసిల్ల 459 205 664
సిరిసిల్ల (బాలికల) 00 302 302
కోనరావుపేట 144 54 198
ఇల్లంతకుంట 201 55 256
వేములవాడ 235 150 385
చందుర్తి 166 38 204
రుద్రంగి 08 52 150
గంభీరావుపేట 96 141 237
ముస్తాబాద్ 95 35 130
ఎల్లారెడ్డిపేట 100 104 204
మొత్తం 1594 1136 2730