Share News

ప్రతిపాదనలకే పరిమితమైన విమానాశ్రయం

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:50 AM

సింగరేణి.. ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రం.. సిమెంట్‌ ఫ్యాక్టరీ, అనేక పరిశ్రమలు.. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు.. పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రామగుండం ప్రాంతానికి విమానాశ్రయం అందని ద్రాక్షగానే మిగిలింది.

ప్రతిపాదనలకే పరిమితమైన విమానాశ్రయం

పెద్దపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): సింగరేణి.. ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రం.. సిమెంట్‌ ఫ్యాక్టరీ, అనేక పరిశ్రమలు.. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు.. పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రామగుండం ప్రాంతానికి విమానాశ్రయం అందని ద్రాక్షగానే మిగిలింది. విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కొత్తదేమీ కాదు. దశాబ్దాల క్రితం ఏర్పాటైన చిన్న ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి మొదలైన ఆశలు.. ఉడాన్‌ పథకం సమయంలో మళ్లీ చిగురించాయి. ఆ తర్వాత ప్రభుత్వాల స్థాయిలో ప్రతిపాదనలు, సర్వేలు, సాధ్యాసాధ్యాల పరిశీలనలూ జరిగాయి. కానీ ఒక్కో దశలో ఎదురైన సాంకేతిక సమస్యలు, స్థల మార్పులు, అనుమతుల ప్రక్రియతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. అంతర్గాం మండలంలో కొత్త స్థలాన్ని గుర్తించి అధ్యయనం చేపట్టినా.. విమానాశ్రయం నిర్మాణానికి ఇంకా ఆమోదముద్ర పడాల్సి ఉంది.

ఫ వాయుదూత్‌ విమానాలతో మొదలైన ప్రయాణం

రామగుండం సమీపంలోని బసంత్‌నగర్‌లో కేశోరాం సిమెంట్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో 1980లో ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో వాయుదూత్‌ విమానాల రాకపోకలకు దీనిని ఉపయోగించారు. ఆ తర్వాత విమాన సేవలు నిలిచిపోవడంతో ఎయిర్‌స్ట్రిప్‌ నిరుపయోగంగా మారింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కొనసాగింది. 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్‌ ప్రాంతీయ విమానయాన పథకం నేపథ్యంలో బసంత్‌నగర్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. అప్పట్లో జిల్లా యంత్రాంగం సుమారు 600 ఎకరాల అదనపు భూమిని గుర్తించింది. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములకు సంబంధించిన అంశాలు పరిశీలనకు వచ్చాయి. 2018, 2019లో విమానయాన అధికారులు స్థలాన్ని పరిశీలించగా.. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) 2019 మార్చి, 2020 ఆగస్టులో సాధ్యాసాధ్యాల పరిశీలించింది. అయితే బసంత్‌నగర్‌ ప్రాంతం విమానాశ్రయ అభివృద్ధికి అనుకూలం కాదని నివేదికలు స్పష్టం చేశాయి.

ఫ కొండలు.. రక్షణశాఖ ఆంక్షలతో అడ్డంకులు

బసంత్‌నగర్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రధానంగా భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. చుట్టుపక్కల ఎత్తైన కొండలు ఉండటంతో విమానాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడుతున్నట్లు ఏఏఐ నివేదిక పేర్కొంది. భారత వైమానిక దళం శిక్షణ కార్యకలాపాలకు సంబంధించిన పరిమిత గగనతల ప్రాంతం ఉండటంతో రక్షణశాఖ అనుమతుల సమస్య తలెత్తింది. 2025 జనవరి 29న కేంద్ర పౌర విమానయాన శాఖ ఇచ్చిన వివరణలో బసంత్‌నగర్‌ స్థలం విమానాశ్రయ అభివృద్ధికి అనుకూలం కాదని పేర్కొంది. అదే ఏడాది మార్చిలో ఈ అంశం వెలుగులోకి రావడంతో పాత స్థలంపై ఆశలు సన్నగిల్లాయి. మరోవైపు, కొత్త స్థలాన్ని గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది.

ఫ అంతర్గాం వైపు అడుగులు

బసంత్‌నగర్‌లో ఎదురైన సమస్యల నేపథ్యంలో రామగుండం సమీపం లోని అంతర్గాం మండలంపై అధికారులు దృష్టి సారించారు. 2025 మార్చి నాటికి సుమారు 600 ఎకరాల భూమిని పరిశీలించి జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గాలి దిశ, వేగం ఆధారంగా రన్‌వే అమరికను నిర్ణయించేందుకు అవసరమైన పరిశీలనలపైనా దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబరు 11న జారీ చేసిన జీవో ఆర్‌టీ నంబర్‌ 465 ద్వారా ప్రీ - ఫీజిబిలిటీ అధ్యయనానికి రూ.40 లక్షల 52 వేల 946ల నిధులు మంజూరు చేసింది. ఈ అధ్యయన బాధ్యతను ఏఏఐకి అప్పగిం చారు. అక్టోబరు 13న ఈ విషయం వెలుగులోకి రావడంతో రామగుండం విమానాశ్రయ ప్రతిపాదనకు మరోసారి కదలిక వచ్చింది.

ఫప్రీ - ఫీజిబిలిటీ నుంచి అనుమతుల వరకు

2025 డిసెంబర్‌ 4న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం, తెలంగాణలో ప్రతిపాదించిన నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల్లో అంతర్గాం ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తికాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, విమా నాశ్రయ అభివృద్ధిదారుల నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అవసరమైన సైట్‌ క్లియరెన్స్‌ ప్రతిపాదన అందలేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఫ 2026 లోనూ కొనసాగుతున్న పరిశీలనలు

2026 ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రులు విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన సందర్భంలో పెద్దపల్లి జిల్లాలో గతంలో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా, సుమారు 980 ఎకరాల భూమిని గుర్తించి ఏఏఐ సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 12:50 AM