అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:12 AM
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మెన్ డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు.
సుభాష్‌నగర్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మెన్ డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135 జయంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఖండాలు దాటి ఉన్నత విద్య అభ్యసించారని తెలిపారు. సుమారు 30 డిగ్రీలు పూర్తిచేసి ప్రపంచ మేధావిగా పేరుగాంచారని కొనియాడారు. కొన్ని యూనివర్సిటీలు ఆయనకు ఉన్నతమైన ఉద్యోగాలకు ఆహ్వానించినప్పటికీ వాటిని కాదని దేశానికి సేవలందించారని అన్నారు. ఇతర దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మన దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగునంగా పనిచేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రా మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలన్నారు. పోలీసు కమిషనర్ గౌస్‌ఆలం మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పన ఎడ్యుకేషన్-ఆర్గనైజ్ అనే మాటలను నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. తాను ప్రభుత్వ విద్యాసంస్థల్లో, స్కాలర్‌షిప్‌తోనే చదివి నేడు ఈ స్థాయికి చేరినట్లు సీపీ గుర్తు చేసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పూర్తితో మనం చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరివాడని, ఆయన ఆలోచనలను మనం ఆచరించి చూపాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పలు సమస్యలను లేవనెత్తారు. ఈ కార్యక్రమానికి రేణికుంట సర్పంచ్ ఎలుక ఆంజనేయులు సభ్యాధ్యక్షత వహించగా, కార్యనిర్వాహక కార్యదర్శి సుద్దాల లక్ష్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆర్‌డీవో మహేశ్వర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ సత్తు మల్లేశం, కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, సోమిడి వేణు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ నరేందర్‌రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, కొరివి వేణుగోపాల్, కొరివి అరుణ్‌కుమార్, మాజీ కార్పోరేటర్ గంట కళ్యాణి, గంటల రేణుక, మాలతి, దామెర సత్యం, బొలుమల్ల సదానందం, మేడి మహేశ్, మేడి అంజయ్య వాసాల శ్రీనివాస్, సొల్లు అజయ్‌వర్మ, కన్నం రమేశ్, ఎంపీడీవో రాము తదితరులు పాల్గొన్నారు.