అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:19 AM
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని, ఏ ఒక్క పరీక్షను బయటకు పంపించకుండా ఆసుపత్రిలోనే నిర్వహించేలా వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రి అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించాలి
గోదావరిఖని, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని, ఏ ఒక్క పరీక్షను బయటకు పంపించకుండా ఆసుపత్రిలోనే నిర్వహించేలా వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం గోదావరిఖనిలోని సిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన పరికరాల వివరాలు, అంచనా వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి క్రిటికల్ కేర్ బ్లాక్ వరకు చేపడుతున్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేయర్ మహంకాళి స్వామి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ హిమబిందు, సీఎస్‌ఆర్ కృపాభాయ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కిరణ్, టీజీఎంఐడీసీ అధికారులు, పాల్గొన్నారు.