ఎరువులన్నీ యాప్‌తోనే..
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:56 AM
యూరియా, ఇతర ఎరువులు దుర్వినియోగం కాకుండా, బ్లాక్ మార్కెట్‌ను నివారించే విధంగా పకడ్బందీగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు యూరియా, ఎరువులు అందకుండా పక్కదారి పట్టించే అడ్డగోలు వ్యవస్థను ఆటకట్టించే దిశగా ఇప్పటికే సాంకేతికతను వినియోగిస్తూ యూరియాను యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే వ్యవస్థ రైతుల ముంగిటకు తీసుకొచ్చారు. అదే తరహాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో యూరియాతోపాటు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు కూడా పారదర్శకంగా, వేగంగా రైతులకు అందించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్ ద్వారా అందించడానికి సిద్ధం చేశారు. రైతులందరూ యాప్‌లోనే డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులన్నీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- యూరియా తరహాలోనే అన్ని ఎరువుల బుకింగ్
- 13 నుంచి జిల్లాలో రెండో విడత ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’ అమలు
- యాప్‌పై వ్యవసాయ అధికారులకు శిక్షణ
- అవగాహన లేక రైతులకు ఇబ్బందులు
- లాగిన్ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ ఉండాల్సిందే
- ఇప్పటివరకు 79.18 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యూరియా, ఇతర ఎరువులు దుర్వినియోగం కాకుండా, బ్లాక్ మార్కెట్‌ను నివారించే విధంగా పకడ్బందీగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు యూరియా, ఎరువులు అందకుండా పక్కదారి పట్టించే అడ్డగోలు వ్యవస్థను ఆటకట్టించే దిశగా ఇప్పటికే సాంకేతికతను వినియోగిస్తూ యూరియాను యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే వ్యవస్థ రైతుల ముంగిటకు తీసుకొచ్చారు. అదే తరహాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో యూరియాతోపాటు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు కూడా పారదర్శకంగా, వేగంగా రైతులకు అందించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్ ద్వారా అందించడానికి సిద్ధం చేశారు. రైతులందరూ యాప్‌లోనే డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులన్నీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడు విడతల్లో జిల్లాలను విభజించి యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈనెల 6న మొదటి విడతలో 10 జిల్లాల్లో యాప్ అందుబాటులోకి రాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడతలో ఈనెల 13వ తేదీ నుంచి రైతులకు యాప్ అందుబాటులోకి వస్తుంది. యాప్ వినియోగంపై ఏఈవోలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కూడా అందిస్తారు. ఇకనుంచి యూరియాతోపాటు డీఏపీ, ఎంవోపీ, ఎంపీకేఎస్‌పీ, ఎఫ్‌వోఎం, పొటాష్. కాంప్లెక్స్ ఎరువులన్నీ యాప్ ద్వారా బుక్ చేసుకుంటేనే రైతులకు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ ద్వారా ఎరువులు పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఐడీ ఆధారంగానే యాప్‌లో లాగిన్ కావచ్చు. లేదా ఆధార్ కార్డుతో లింక్ అయినా మొబైల్ నంబర్‌తోనైనా లాగిన్ కావాల్సి ఉంటుంది. జిల్లాలో ఇంకా రైతులు చాలా మంది ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాల్సి ఉంది.
ఖరీఫ్ సాగు అంచనా 2.48 లక్షల ఎకరాలు..
జిల్లాలో ఖరీఫ్ సాగు 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం ప్రారంభమైన దాదాపు 50 రోజుల పాటు వర్షాలు లేక సాగు పనులు నెమ్మదిగానే సాగాయి. గత 20 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు చివరి దశకు చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల 7885 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగు చేశారు. ఖరీఫ్ సాగుకు 43150 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు 25291 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 10005 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
యాప్‌పై రైతుల ఆందోళన
గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియాను స్మార్ట్‌ఫోన్‌తో పాటు మీసేవ కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికీ యూరియా బుకింగ్‌లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలు, రైతులకు అవగాహన లేకపోవడంతో ఓటీపీ చెప్పేలోగా ఎరువుల నిల్వలు ఖాళీ అవుతుండడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డారు. చాలామంది రైతుల వద్ద స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో ప్రధాన సమస్యగానే మారింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ రైతుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త యాప్ అమల్లోకి రావడంతోనే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పూర్తిగా నిలిపివేయనున్నారు. పాత యాప్ ద్వారా ఎకరానికి రెండు బస్తాలే ఇవ్వగా కొత్త యాప్‌లో ఎన్ని బస్తాలు ఇస్తారో స్పష్టత లేకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. గతంలో రైతులు ఫర్టిలైజర్ డీలర్ వద్దకు వెళ్లి అవసరమైన ఎరువులు అన్ని ఒకేసారి కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. రైతుల వద్ద డబ్బులు లేకున్నా దుకాణదారుల వద్ద అప్పుగా ఎరువులు తెచ్చుకునేవారు. ప్రస్తుతం డబ్బు కట్టిన తర్వాతనే ఎరువులు వస్తున్నాయి. దీంతో ఎరువుల యాప్ కొత్త సమస్యలు తెస్తుందని రైతులు కలవర పడుతున్నారు.
జిల్లాలో 79.18 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు పథకాలన్నీ ఫార్మా రిజిస్టర్ ఐడీ తప్పనిసరిగా మార్చింది. సీసీఎల్‌ఏ ద్వారా సేకరించిన భూపట్టా పాస్‌పుస్తకాల వివరాలను రైతు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం ద్వారా ఫార్మర్ ఐడీని కేటాయిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79.18 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ జరిగింది. రైతు వేదికల్లో ఉచితంగా, మీసేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి రైతులు నేరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినా అన్నదాతలు మాత్రం అనాసక్తి వీడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే వ్యవసాయ పథకాలకు 11 అంకెల యూనిక్ ఫార్మర్ ఐడీ ఉపయోగపడుతుంది. భూమికి సంబంధించిన సమాచారం పూర్తిగా డిజిటల్ రూపంలో నిక్షిప్తం కావడం వల్ల ఫసల్ బీమా, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, నేచురల్ ఫార్మింగ్ మిషన్, సాయిల్ హెల్త్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ జన్‌ధన్ యోజన, జాతీయ ఆహార భద్రత పథకం, నాబార్డ్ రుణ సహాయం, కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువులు, యంత్ర పరికరాలు రైతులకు అందించడానికి ఫార్మర్ రిజిస్ట్రీతో ముడిపడి ఉంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా మోసాలు, నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలు జరగకుండా పారదర్శకతగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కిసాన్ ఐడీ నమోదుకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా జిల్లాలో ఇంకా చాలామంది రైతులు నమోదు చేసుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా 2.47 ఎకరాలకు సంబంధించి 75931 మంది రైతుల వద్ద 81416 ఎకరాలు ఉన్నాయి. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధించి 25092 మంది రైతుల వద్ద 86460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8346 మంది రైతుల వద్ద 53560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1427 మంది రైతుల వద్ద 18962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2756 ఎకరాల భూములు ఉన్నాయి. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులు 139823 మంది ఫార్మర్ రిజిస్ట్రీకి అర్హులుగా ఉన్నారు. ఇందులో ఆప్పవరకు 110723 రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. 79.18 శాతంతో జిల్లాలో ఇంకా 29100 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సి ఉంది.
జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సాగు (ఎకరాల్లో)
వరి 1,44,330
పత్తి 50,275
మొక్కజొన్న 4,030
కందులు 2,140
పెసర 2,020
ఇతర 5,090
మొత్తం 2,07,885
జిల్లాలో ఖరీఫ్‌కు కావాల్సిన ఎరువులు పంపిణీ (మెట్రిక్ టన్నుల్లో)
ఎరువులు కావాల్సిన ఎరువులు పంపిణీ చేసింది ప్రస్తుతం నిల్వ
యూరియా 21,000 16,203 7421.9
డీఏపీ 3,750 1,540 200.9
కాంప్లెక్స్ 13,450 6,486 2223.32
ఎంవోపీ 4,950 1,062 159.2
మొత్తం 43,150 25,291 10,005.32
యాప్ ద్వారా ఎరువులు
- అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
యూరియా తరహాలోనే ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా బుకింగ్‌తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన యాప్ రెండవ పేజ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమల్లోకి వస్తుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏఈవోలకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫార్మార్ రిజిస్ట్రీ లేదా ఆధార్ నంబర్‌తో లింక్ అయినా మొబైల్ నంబర్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవచ్చు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ 79.18 శాతం జరిగింది. మిగిలిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి.