Share News

ఆర్భాటమే తప్ప... ఆచరణ లేదు!

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:03 AM

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. విద్యార్థులకు అందించాల్సిన ఉచిత పాఠశాల కిట్లు, యూనిఫాంలు, అల్పాహార పథకం అమలులో తీవ్ర జాప్యం నెలకొన్నది.

ఆర్భాటమే తప్ప... ఆచరణ లేదు!

- నేటికి పాఠశాలలకు అందని కిట్లు

- యూనిఫాం క్లాత్‌ సరఫరాకు దిక్కు లేదు

- అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు లేవు

- ఎదురుచూస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. విద్యార్థులకు అందించాల్సిన ఉచిత పాఠశాల కిట్లు, యూనిఫాంలు, అల్పాహార పథకం అమలులో తీవ్ర జాప్యం నెలకొన్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ప్పటికీ, పాఠశాలల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్త్తున్నాయి. జిల్లాలో 357 ప్రాథమిక పాఠశాలలు, 83 ప్రాథమికోన్నత పాఠశాలలు, 103 జిల్లా పరిషత్‌ పాఠశాలలు, 10 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 30,991 విద్యార్థులు చదువుతున్నారు. యేటా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో వారంతా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్‌బుక్కుల పంపిణీ, రెండు జతల యూనిఫారంలతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ విద్యార్థికి 21 రకాల వస్తువులు గల కిట్లతోపాటు ఉదయం పూట అల్ఫాహారం పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పాఠశాలల ఆరంభం నాటికే కిట్లు, యూనిఫాంలు అందజేసి అల్ఫాహారాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇరవై రోజులు గడుస్తున్నా కూడా యూనిఫాంల క్లాత్‌, కిట్లు సరఫరా కాలేదు. గత నెలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయులు కిట్లు, అల్ఫాహారం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.

ఫ 106 మందికి మాత్రమే కిట్లు..

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ విద్యార్థికి 21 రకాల వస్తువులు గల కిట్లను అందజేస్తామని ప్రకటించారు. ఇందులో పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, రెండు జతల యూనిఫాంలతోపాటు షూస్‌, రెండు జతల సాక్సులు, స్కూల్‌ బ్యాగ్‌, బెల్ట్‌, టై, వర్క్‌బుక్‌, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్‌, షార్ప్‌నర్‌, జామెట్రీ బాక్స్‌, డిక్షనరీ గల కిట్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్ర మంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కిట్లను పంపిణీ చేశారు. ఆ కిట్లలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు, ఒక జత ష్యూస్‌, సాక్సులు, బెల్టు, టై మాత్రమే ఉన్నాయి. అవి కూడా జిల్లాలోని 106 మంది విద్యార్థులకే సరఫరా చేశారు. కానీ అవి పాఠశాలల్లోనే ఉన్నాయి. మిగతా విద్యార్థులకు కిట్లు సరఫరా కాలేదు. ఎప్పుడు పంపిణీ చేస్తారా అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

ఫ యూనిఫాంల జాడ లేదు..

యేటా విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అందించే రెండు జతల యూరిఫాంలను ఇప్పటి వరకు అందించ లేదు. నేటికి కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్లాత్‌ సరఫరా చేయలేదు. దీంతో గతేడాది యూనిఫాంలతోనే విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. కొందరు విద్యార్థుల యూనిఫాంలు చిరిగిపోయినా కొత్తవి లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పాఠశాలలకు సివిల్‌ డ్రెస్‌లపై వస్తున్నారు. క్లాత్‌ ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికిప్పుడు క్లాత్‌ సరఫరా అయినా వాటిని కుట్టేందుకు నెల రోజుల సమయమైనా పడుతుందని టైలర్లు చెబుతున్నారు.

ఫ అల్పాహారం ఎప్పుడో..?

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం కూడా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యమని చెప్పినా, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా చాలా పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చి మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లాలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నా భోజన పథకాన్ని అమలు చేస్తున్న ట్రస్టులున్న జిల్లాల్లో మాత్రమే అల్ఫాహారాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిట్ల పంపిణీతో పాటు క్లాత్‌ సరఫరా చేయాలని, అల్పాహారాన్ని అమలు చేయాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 01:03 AM