Share News

అన్ని శాఖలు అక్కడే

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:10 AM

కొత్త కలెక్టరేట్‌కు కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దసరా పండుగ తర్వాత మంచి రోజులున్నాయనే భావనతో అధికారులు ఈ దిశగా అడుగులేశారు.

అన్ని శాఖలు అక్కడే
వాహనంలో నుంచి దస్ర్తాలను దించుతున్న తీరు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

కొత్త కలెక్టరేట్‌కు కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దసరా పండుగ తర్వాత మంచి రోజులున్నాయనే భావనతో అధికారులు ఈ దిశగా అడుగులేశారు. ముహూర్తం చూసుకుంటూ ఒక్కొక్క విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లోకి అడుగుపెడుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఇదే పనిలో యంత్రాంగమంతా బిజీగా ఉన్నారు. వచ్చే సోమవారం నాటికి ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన గదుల్లో కొలువుదీరాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఈ దిశగా వేగం పెంచుతున్నారు. కలెక్టరేట్‌లోకి ఏఏ శాఖలు మారాలనే విషయంలోనే గత పక్షం రోజులుగా ఉన్నతాధికారులు తర్జనభర్జన పడ్డారు. అద్దె భవనాల్లో ఉంటున్న వారితో పాటు అరకొర వసతులున్న విభాగాలకు ప్రాధాన్యతనిచ్చారు. దీంతోపాటు ప్రజలతో ఎక్కువగా సంబంధాలున్న శాఖలన్నీ కలెక్టరేట్‌లో ఉండాలనే కోణంలోనూ నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో సహా సమావేఽశ మందిరాలను గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేటాయించారు. ఆయా శాఖలను మొదటి, రెండో అంతస్తుకు మార్చారు.

ఏ విభాగాలు ఎక్కడెక్కడ

- గ్రౌండ్‌ ఫ్లోర్‌లో... సమాచార పౌరసంబంధాల శాఖ, జిరాక్స్‌ దుకాణం, కలెక్టరేట్‌ ఐటీ వింగ్‌(ఎన్‌ఐసీ), వీడియో కాన్ఫరెన్స్‌ గది, జిల్లా సంక్షేమ శాఖ, కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డ్‌, ఔట్‌ వార్డు సెక్షన్‌లు, ఎన్నికల విభాగం, రెవెన్యూ రికార్డ్‌ గది, కలెక్టరేట్‌లోని రెవెన్యూ సెక్షన్‌లు, డీఆర్వో ఛాంబర్‌, ఏవో కార్యాలయం, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) ఛాంబర్‌, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) వెయిటింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లున్నాయి.

- మొదటి అంతస్తులో.. డీఆర్డీవో, జిల్లా పంచాయతీ కార్యాలయం, హౌజింగ్‌ పీడీ, పీడీ మెప్మా, భూమి రికార్డుల సర్వే విభాగం, ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో), డీటీసీపీవో(డిస్ర్టిక్ట్‌ టౌన్‌ ఆండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆఫీసర్‌) కార్యాలయం, జిల్లా విద్యాధికారి కార్యాలయం, బీసీ సంక్షేమశాఖ కార్యాలయం, గిరిజన సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమ కార్యాలయాలున్నాయి.

- రెండో అంతస్తులో జిల్లా సహకార శాఖ, లేబర్‌ కమిషనర్‌, జిల్లా ఇన్స్‌రెన్స్‌ అధికారి, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి కార్యాలయం, ఎక్సైజ్‌ శాఖ, పౌర సరఫరాల శాఖ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ కార్యాలయం, మైనింగ్‌ శాఖ, క్యాంటీన్‌, ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ, పీడీ ఆత్మ కార్యాలయం, డీడీ సెరికల్చర్‌, ఆడిట్‌ కార్యాలయం, చేనేత జౌళి శాఖలకు కేటాయించారు.

పర్యవేక్షణలో దస్ర్తాలు

కీలకమైన రెవెన్యూ రికార్డులను పదిలంగా కొత్త కలెక్టరేట్‌కు తరలించేందుకు కొందరు అధికారులకు పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. పాత కలెక్టరేట్‌ నుంచి ఎన్ని దస్ర్తాలను పంపిస్తున్నామనే లెక్కను కొత్త కలెక్టరేట్‌ వద్ద గమనిస్తూ రికార్డు గదిలో జాగ్రత్తగా అమరుస్తున్నారు. ఇదే తరహాలో సంక్షేమ శాఖలకు చెందిన ఫైల్స్‌ను సిబ్బంది జాగ్రత్తగా వాహనాల్లో కొత్త కలెక్టరేట్‌కు తీసుకొస్తున్నారు. మూటలుగా కట్టిన దస్ర్తాలలో ఒక్క ఫైల్‌ కూడా మిస్‌ అవకుండా కార్యాలయ సిబ్బందిని వాహనంలో పంపిస్తున్నారు. మరోవైపు పాత కార్యాలయంలోని సామగ్రి కొత్త భవనంలోకి మారుస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌లో అన్ని కార్యాలయాలకు కొత్త ఫర్నీచర్‌ సమకూరలేదు. దీంతో తాత్కాలికంగా పాత కార్యాలయాల్లోని టేబుల్స్‌, కుర్చీలు, బీరువాలను తీసుకొచ్చుకుంటున్నారు. అయితే కొన్ని శాఖలకు అవసరమైన ఫర్నిచర్‌ను కొనుగోలు చేసుకోవాలనే ఆదేశాలిచ్చారు. అయితే ఈ రెండు మూడు రోజులు ఈ శాఖలన్నీ దస్ర్తాలు, సామగ్రి తరలింపు ప్రక్రియలో బిజీగా ఉండనుండటంతో ప్రజలకు అందే సేవల్లో అంతరాయం వాటిల్లే వీలుంది. మొత్తంగా కొత్త కలెక్టరేట్‌లో వచ్చే వారం నుంచి ఆయా శాఖలు కొలువుదీరి కొత్త పాలనను అందించనున్నాయి.

Updated Date - Oct 24 , 2026 | 12:10 AM