మద్యం ధమాకా
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:54 PM
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. జిల్లాలో డిసెంబరు 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో 30.71 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
కరీంనగర్ క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. జిల్లాలో డిసెంబరు 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో 30.71 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 31న అమ్మకాలు మద్యం అమ్మకాలను అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతించారు. మద్యం డిపోను రాత్రి వరకు తెరిచి ఉంచారు. డిసెంబరు 29, 30, 31న మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లాలో 94 వైన్‌షాపులు, 34 బార్లు, క్లబ్‌లున్నాయి. వీటి ద్వారా ఈ మూడు రోజుల్లో 30.71 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగింది. అంటే రోజుకు సరాసరి 10.24 కోట్ల వరకు విక్రయాలు జరిగాయి. ఇది కేవలం మద్యం డిపోలో అమ్మకాల విలువ. దీనికి మరో 20 శాతం మార్జిన్‌తో కలిసి రిటైల్ షాపుల్లో మద్యం విక్రయాలు జరిగాయి.
ఫ ఎక్సైజ్ స్టేషన్ల వారీగా..
కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 21 వైన్‌షాపులు, 23 బార్ల ద్వారా 13.81 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 26 వైన్ షాపులు, 3 బార్‌ల ద్వారా 6.5 కోట్ల విలువ కలిగిన మద్యం అమ్ముడైంది. తిమ్మాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 14 వైన్‌షాపులు, ఒక బార్ ద్వారా 4,82 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. హుజూరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 17 వైన్‌షాపులు, 4 బార్ల ద్వారా 3,17 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 16 వైన్‌షాపులు, 3 బార్ల ద్వారా 2.40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఫ గత ఏడాదికంటే రూ. 28.37 కోట్లు అధికం
2025 డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు నెల రోజుల్లో 154 కోట్ల 40 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. 1,36,442 పెట్టెల విస్కీ, 1,41,661 పెట్టెల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది(2024 డిసెంబరులో) 126.03 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 1,16,963 పెట్టెల విస్కీ, 1,57,659 పెట్టెల బీర్లు విక్రయించారు. గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది డిసెంబరు నెలలో 28.37 కోట్ల రూపాయల విలువైన మద్యం అధికంగా అమ్ముడుపోయింది. 2025లో కొత్తగా లైసెన్స్‌లు పొందడంతో పాటు, గ్రామ పంచాయతి ఎన్నికల నేపథ్యంలో రిటైలర్లు స్టాక్‌ను అధికంగా కొనుగోలు చేశారని, దీంతో మద్యం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.