లెక్కల్లో పారదర్శకతే లక్ష్యంగా..
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:38 AM
మహిళా స్వయం సహాయక సంఘాల్లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళా స్వయం సహాయక సంఘాల్లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల బలోపేతం, రికార్డుల నిర్వహణ, లెక్కల్లో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీరెండు సంతిఘాలు, వీలైతే సంఘానికి ఒక బుక్ కీపర్ ఉండగా, ప్రతీరెండు లేదా ఒకసంఘానికి ఒక బుక్ కీపర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎంపికైన బుక్ కీపర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లాలో 1,82,261 మంది సభ్యులు..
జిల్లాలో 16,273 స్వయం సహాయక సంఘాలుండగా 1,82,261మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో సంఘంలో సుమారు 11నుంచి 12మంది సభ్యులున్నారు. జిల్లాలో 565విలేజ్ ఆర్గనైజేషన్స్(వీవో) ఉన్నాయి. సంఘాలకు ఇందిరా మహిళాశక్తితోపాటు కేంద్రప్రభుత్వం ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా నిధులు అందిస్తోంది. సభ్యులు తీసుకున్న రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్రతినెలా రుణవాయిదాలను సంఘాలకు చెల్లిస్తుంటారు. స్త్రీనిధి పథకం నుంచి కూడా రుణాలు తీసుకుని చెల్లిస్తున్నారు.
చురుకైన వారికి ప్రాధాన్యం..
స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణాలు, చెల్లింపులు, వడ్డీ తదితర వ్యవహారాలను బుక్ కీపర్లు నమోదు చేస్తుంటారు. స్వయం సహాయక సంఘాల లెక్కలు, వడ్డీ, తదితర అంశాలను బుక్కుల్లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అయిదు సంఘాలకో బుక్‌కీపర్ ఉండగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రతిసంఘానికో బుక్‌కీపర్‌ను నియమించేందుకు చర్యలు చేపట్టారు. సంఘంలో చురుగ్గా ఉండి విద్యావంతులైన సభ్యులను బుక్ కీపర్లుగా నియమించనున్నారు. ఎక్కువ మంది ఉంటే ఒకరిని నియమిస్తూ తీర్మానం చేసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీరెండు సంఘాలకు ఒకరిని నియమించాలని నిబంధనలు ఉన్నప్పటికీ సంఘంలో చురుకైన వారు ఉంటే బుక్ కీపర్‌ను నియమించుకునే అవకాశం కల్పించింది. సంఘాల్లోని సభ్యులనే బుక్ కీపర్‌లుగా నియమించడం వల్ల లెక్కల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. బుక్ కీపర్ల నిర్వహణకు సంఘ సభ్యుల తీర్మాణం మేరకు రూ.150నుంచి రూ.300వరకు చెల్లించుకునే సదుపాయం కల్పించారు.
- ఎంపికైన వారికి శిక్షణ..
- రఘువరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, జగిత్యాల
గతంలో ఐదు సంఘాలకు ఒక బుక్ కీపర్‌ను నియమించేది. ప్రస్తుతం రెండు సంఘాలకు ఒక బుక్ కీపర్ లేదంటే రాసేవారుంటే సంఘానికి ఒక బుక్ కీపర్ కూడా ఉండవచ్చును. బుక్ కీపర్‌గా ఎంపికైన వారికి శిక్షణ ఇస్తాం. అందుకోసం మండలానికి ఇద్దరు సీసీలకు శిక్షణ అందించాం.