Share News

నిరాదరణలో వృద్ధాప్యం

ABN , Publish Date - May 23 , 2026 | 01:13 AM

సమాజంలో వృద్ధులకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ పిల్లల నిర్లక్ష్యం, వారసుల ఆస్తి తగాదాలతో వేధింపులు ఆగడం లేదు. ఇంటా, బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ జీవిత చరమాంకాన్ని కన్నీటిమయంగా గడుపుతున్నారు.

నిరాదరణలో వృద్ధాప్యం

- చట్టం ఉన్నా ఆగని వేధింపులు

- చరమాంకంలో పలువురు వృద్ధ దంపతులకు తప్పని తిప్పలు

- గత యేడాది జిల్లాలో 66 కేసులు నమోదు

జగిత్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): సమాజంలో వృద్ధులకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ పిల్లల నిర్లక్ష్యం, వారసుల ఆస్తి తగాదాలతో వేధింపులు ఆగడం లేదు. ఇంటా, బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ జీవిత చరమాంకాన్ని కన్నీటిమయంగా గడుపుతున్నారు. జిల్లాలో జరిగిన ఓ ప్రైవేటు సర్వే ప్రకారం 35 శాతం వేధింపులు ఆస్తులు, స్థలాలు తమ పేర్లపై రాయాలని పిల్లలు తల్లిదండ్రులను వేదించడం వల్ల జరుగుతున్నాయని తేలింది. 30 శాతం మంది వృద్ధులు తిండి, దుస్తులు వంటి కనీస అవసరాలను పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. 25 శాతం సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు వైద్య ఖర్చులు భరించలేక, సేవలు చేయలేక వారిని దూరం పెడుతున్నారు.

ఫఆపన్నహస్తం అందిస్తున్న అసోసియేషన్‌..

నిరాదరణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రులకు జిల్లాలో ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఆసరాగా నిలుస్తోంది. అసోసియేషన్‌ ప్రతినిధులను వయో వృద్ధులను కలుస్తూ వారికి ఫిర్యాదులు ఇస్తే వారి వారసులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తూ కొన్ని కేసులను పరిష్కరిస్తున్నారు. ఇక కౌన్సిలింగ్‌లో మారని వారిపై సంబంధిత ట్రిబ్యునల్‌ చైర్మన్‌ అయిన రెవెన్యూ డివిజనల్‌ అధికారుల వద్ద ఫిర్యాదులు చేస్తున్నారు. అసోసియేషన్‌ ప్రతినిధులు హరిఅశోక్‌ కుమార్‌తో పాటు గౌరిశెట్టి విశ్వనాథం, హన్మంత్‌రెడ్డి, విజయ్‌, ప్రకాశ్‌, యాకూబ్‌ తదితరులు వయో వృద్ధుల సంక్షేమ చట్టంపై వృద్ధులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 1,20,227 మంది వృద్ధులు ఉన్నారు. గత యేడాది జగిత్యాల జిల్లాలో 66 కేసులు నమోదు అయ్యాయి. సిరిసిల్లలో 36, కరీంనగర్‌లో 48, పెద్దపల్లిలో 32 ఫిర్యాదులు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 94 మంది కేసులు పరిష్కారం చేయగా, 88 కేసులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి.

ఫసీఎం చొరవతో తల్లిదండ్రుల పోషణ చట్టం-2026

తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల డే కేర్‌ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీ తనం, పర్యవేక్షణ చట్టం-2026 అసెంబ్లీలో ఆమోదం పొందింది. ప్రభుత్వం ఒక ప్రధాన కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లతో వయో వృద్ధుల కమిషన్‌ ఏర్పాటు చేయడానికి కసరత్తులు చేస్తోంది. ఈ బిల్లులో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదలి వేసే ఉద్యోగుల వేతనాల్లో నుంచి గరిష్టంగా రూ. 10 వేల మేరకు కోత విధించి తల్లి దండ్రుల పోషణ నిమిత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల కే కాకుండా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జిల్లా కలెక్టర్‌ లేదా జిల్లా మేజిస్ట్రేట్‌కు తల్లి లేదా తండ్రి లేదా ఇరువురు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన 60 రోజుల్లో పరిష్కారం చూపుతారు. ఆ తరువాత వచ్చే నెల నుంచి ఆ ఉద్యోగి వేతనం నుంచి తల్లి దండ్రుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేస్తారు. చట్ట రూపం దాల్చిన తరువాత ఏర్పాటు అయ్యే వయో వృద్ధుల కమిషన్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా మరొకరిని కమిషనర్‌గా నియమించనున్నారు.

వృద్ధులను నిరాదరిస్తే చర్యలు తీసుకోవాలి

-హరి అశోక్‌కుమార్‌, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

వారసుల చేతిలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు మా సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. వయో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం 2026 బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం హర్షణీయం. ట్రిబ్యునల్‌ అధికారులైన ఆర్డీవోల తీర్పులు బేఖాతరు చేస్తున్న కొడుకులు, కూతుర్లు, వారసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వృద్ధుల సంక్షేమానికి చట్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లకు కృతజ్ఞతలు.

వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, సంక్షేమశాఖ మంత్రి

వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు 2026 ఆమోదం పొందింది. ఈ బిల్లు అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి శాఖలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నాము. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఇందులో భాగస్వాములై పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలి. వయోవృద్ధుల సంరక్షణను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.

ఇటీవల జరిగిన సంఘటనలు

ఫ మల్యాలకు చెందిన ఓ వృద్ధ దంపతులు తమ ఆస్తిని ఇద్దరు కొడుకులకు గిప్ట్‌డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారు. తల్లిదండ్రులను కొడుకులు పోషించకపోవడంతో తమ 24 గుంటల భూమికి సంబంధించిన గిఫ్ట్‌డీడ్‌ రద్దు చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఆదేశాలు బేఖాతర్‌ చేయడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల గిఫ్ట్‌డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్‌ రద్దు చేస్తే కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు.

ఫ తమ ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకొని ఇంట్లోంచి కొడుకు గెంటి వేశాడని వెల్గటూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఎస్పీని ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళదామని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ తండ్రిని ఆయన కొడుకు జగిత్యాల బస్టాండులో విడిచి వెళ్లగా గమనించిన స్థానికులు ఆ రాత్రి తమ ఇంటిలో ఆశ్రయమిచ్చి మరుసటి రోజు కొడుకు కు కౌన్సెలింగ్‌ ఇచ్చి అప్పగించారు.

ఫ మల్యాల మండలంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధ తండ్రిని ప్రజా ప్రతినిధిగా పనిచేసిన కొడుకు పట్టించు కోవడం లేదని ఇటీవల మళ్లీ ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు.

ఫ రాయికల్‌ మండలం మూటపల్లికి చెందిన ఓ వృద్ధ తండ్రి పోషణ పట్టించుకోవడం లేదని కూతురిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. రూ.కోట్ల విలువయిన ఆస్థి గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఫ ధర్మపురికి చెందిన ఓ ముస్లిం వృద్ధుడు తన ముగ్గురు కుమారులు పోషణ పట్టించుకోకుండా ఇంటి నుంచి బలవంతంగా గెంటి వేశారని ఆర్డీవోకు ఇటీవల ఫిర్యాదు చేశాడు.

ఫ జగిత్యాల హనుమాన్‌వాడకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని కొడుకులు ఇంటి నుంచి గెంటివేయడంతో అదేవాడలో ఓ షెడ్డులో తలదాచుకుంటూ తనకు న్యాయం చేయాలని అధికారులను ఆశ్రయించింది.

ఫ జగిత్యాల అర్బన్‌ మండలం దరూర్‌ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిని కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటివేయడంతో స్థానిక రామాలయం వద్ద భిక్షాటనతో పొట్టగడుపుకుంటూ జిల్లా సంక్షేమ అధికారిని ఆశ్రయించింది. ఆర్డీవో మధుసూదన్‌ ఆధ్వర్యంలో కొడుకు, కోడలుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తిరిగి ఇంటికి పంపారు.

Updated Date - May 23 , 2026 | 01:13 AM