Share News

సీపీవోలో 30 ఏళ్లుగా పాగా

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:04 AM

అతను ఒక కానిస్టేబుల్‌.. లా అండ్‌ ఆర్డర్‌ లేదా ఇతర సివిల్‌ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంది. కాని ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్లపాటు సీపీవో(కమిషనరేట్‌ పోలీస్‌ ఆఫీస్‌)లోనే అటాచ్డ డ్యూటీ చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందినప్పటికీ ఆ విభాగాన్ని వీడకుండా అంటిపెట్టుకుని అక్కడే డ్యూటీ చేశాడు.

సీపీవోలో 30 ఏళ్లుగా పాగా

- పదోన్నతి పొందినా అక్కడే డ్యూటీ

- లొసుగులను అనుకూలంగా మలుచుకుని రూ. 1.4 కోట్ల స్వాహా

- కుంభకోణంలో విచారణ వేగవంతం

- నిందితుల కస్టడీకి కోర్టులో పిటిషనకు సమాయత్తం

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): అతను ఒక కానిస్టేబుల్‌.. లా అండ్‌ ఆర్డర్‌ లేదా ఇతర సివిల్‌ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంది. కాని ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్లపాటు సీపీవో(కమిషనరేట్‌ పోలీస్‌ ఆఫీస్‌)లోనే అటాచ్డ డ్యూటీ చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందినప్పటికీ ఆ విభాగాన్ని వీడకుండా అంటిపెట్టుకుని అక్కడే డ్యూటీ చేశాడు. ఇంకేముంది... కమిషనరేట్‌లో పోలీసు అధికారుల నుంచి కానిస్టేబుల్‌, సిబ్బందికి వేతనాల బిల్లులు, అలవెన్స బిల్లులు, ఇతర బిల్లులు తయారుచేసే కీలక శాఖ అయిన సీపీవోలో పని విధానాన్ని పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు. ఎక్కడ? ఎలాంటి లొసుగులు ఉన్నాయనే విషయంపై అవగాహన పెంచుకున్నాడు. దీనికి తోడు ఆ విభాగం హెడ్‌ మద్దతు కూడా ఉండడంతో ఇద్దరు కలిసి అక్రమాలకు తెరలేపారు. మరణించిన పోలీసు ఉద్యోగుల ఐడీలను ఉపయోగించి పోలీసుశాఖతో సంబంధంలేని మరో ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులను ఉద్యోగులుగా చూపిస్తూ వారి పేరిట ప్రతి నెలా వేతనాలు నకిలీ వ్యక్తుల పేరిట ఉన్న అకౌంట్లకు తరలించి 1.4 కోట్లకుపైగా స్వాహా చేశారు. ఈ ఘటన పోలీసుశాఖలో రాష్ట్రంలోనే తీవ్రచర్చకు దారితీసింది. ఈ ఘటనతో పోలీసుశాఖలోని సీపీవోలో ఉన్న లోపాలను వేలెత్తిచూపింది. కొద్ది రోజుల క్రితమే ఈ విషయం పోలీస్‌కమిషనర్‌ దృష్టికి వచ్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీతో లోతుగా విచారణ జరిపి నిందితులైన హెడ్‌కానిస్టేబుల్‌ నీలం రాంమోహన, రిటైర్డ్‌ ఏవో మునిరత్నంతోపాటు నకిలీ ఉద్యోగులుగా బ్యాంక్‌ఖాతాలు తెరచిన ముగ్గురు వ్యక్తులను వనటౌన సీఐ శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసు ఉద్యోగులుగా వేతనాలు పొందిన ముగ్గురు వ్యక్తులు కూడా రాంమోహనకు తెలిసినవారే.. ఇతరులను చేరిస్తే ఎక్కడ బయటపడుతుందోననే ఉద్దేశంతో ఆయన అనుచరుల పేరిట ఖాతాలు తెరచి, ఆ ఖాతాలకు రాంమోహన ఫోననంబరు అనుసంధానం చేశారు.

ఫ మరికొందరి హస్తం..?

ఈ కుంభకోణంలో నీలం రాంమోహన, ఏవో మునిరత్నంతోపాటు మరికొందరి హస్తం ఉంటుందని పోలీసు సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1996లో అప్పటి డీపీవో (డిసి్ట్రక్ట్‌ పోలీస్‌ ఆఫీస్‌)కు అటాచ్డగా చేరిన నీలం రాంమోహన అక్కడ పే సెక్షనలో పని చేస్తుండేవాడు. 30 ఏళ్లుగా అక్కడే అటాచ్డగా విధులు నిర్వహించిన రాంమోహనపై పలు ఫిర్యాదులు రావడంతో కొద్ది రోజుల క్రితం చిగురుమామిడి పోలీస్‌స్టేషనకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఒకసారి సిబ్బంది టీఏ బిల్లులను కూడా అతనే వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. సిక్‌ లీవ్‌ల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన విషయంలో అతనిపై విచారణ జరిగిందని, రాంమోహనతో డబ్బుల వ్యవహారంలో ఒక మహిళ అప్పటి సీపీకి ఫిర్యాదు చేయగా సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు తెలిసింది. రాంమోహన చాలా కాలంగా కరీంనగర్‌లో రియల్‌ఎస్టేట్‌, బిల్డర్‌గా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

ఫ ఇంటి వద్ద ఉద్యోగుల పే బిల్స్‌

కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఐటీ రిటర్న్స్‌ను కూడా రాంమోహన చేసేవాడని, ఇందుకు కొంత డబ్బులు తీసుకునేవాడని చెబుతున్నారు. ఐటీకి సంబంధించి రిఫండ్‌గా వచ్చిన మొత్తం నుంచి 10 శాతం కమీషనను వసూలు చేసేవాడని తెలిసింది. రాంమోహన ఐదారు నెలల క్రితమే సీపీవో నుంచి బదిలీ అయినా అతని ఇంటి వద్దనే ఉద్యోగుల పే బిల్స్‌ చేసేవాడని తెలుస్తోంది. పే బిల్స్‌ సెక్షనలో సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ బిల్లులు వారు ఎందుకు చేయలేదు? రాంమోహనతోనే ఎందుకు పే బిల్స్‌ చేయించేవారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన పోలీసుల ఉద్యోగుల ఐడీలను ఉపయోగించి ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట అక్రమంగా వేతనాలు కాజేసిన కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరపాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన దాఖలు చేసేందుకు కరీంనగర్‌ వనటౌన పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరణించిన పోలీసుఉద్యోగుల పేరిట 1.40 కోట్లు స్వాహా వరకే ఈ కుంభకోణం పరిమితమైందా? మరిన్ని అవకతవకలకు పాల్పడ్డారా? అనే విషయాన్ని తేల్చేందుకు విచారణాధికారులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 02:04 AM