ముందస్తు కోటా
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:08 AM
వేసవి కాలంలో రేషన బియ్యం కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో మూడు నెలలకు సంబంధించిన రేషన ఒకేసారి ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
జగిత్యాల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలంలో రేషన బియ్యం కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో మూడు నెలలకు సంబంధించిన రేషన ఒకేసారి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఒకేసారి మూడు నెలల (ఏప్రిల్, మే, జూన)కు సంబంధించిన రేషన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున గడువుతో సంబంధం లేకుండా లబ్ధిదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
- 10,27,397 మంది లబ్ధిదారులు..
జిల్లావ్యాప్తంగా సుమారు 2,52,072 వివిధ రేషన కార్డులున్నాయి. ఇందులో 10,27,397 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాగా జిల్లాలో ఆహార భద్రతా కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 3,37,376 కార్డులుండగా 9,91,888 మంది సభ్యులున్నారు. ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 14,572 ఉండగా 35,367 మంది సభ్యులున్నారు. 124 ఏఏపీ కార్డులుండగా ఇందులో 142 మంది సభ్యులున్నారు. వీరికి మూడు నెలలకు గానూ 1,93,87,764 కిలోల రేషన బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయడానికి సమాయత్తం అవుతోంది.
ఫ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని...
ప్రభుత్వం మూడు నెలల రేషన బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో కొవిడ్ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలలకోటా ఇచ్చారు. అదేవిధంగా గత యేడాది వర్షాకాలం సందర్భంగా జూన, జూలై, ఆగస్టు నెలలకు చెందిన బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ప్రస్తుతం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- సమస్యలు అధిగమిస్తేనే...
గడిచిన వానాకాలంలో మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేసినప్పుడు రేషన డీలర్లు కొంత మేర ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్టాక్ భద్రపర్చడానికి సరిపడా స్థలం లేకపోవడంతో డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఒకేసారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారుల నుంచి ఈపాస్ యంత్రంపై మూడు పర్యాయాలు బయోమెట్రిక్ ద్వారా బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడానికి సుమారు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు వారాల పాటు రేషన షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడునెలల కోటా ఒకేసారి నిల్వ చేయటానికి సరిపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యం వచ్చినట్లుగా గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15 రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- సన్న బియ్యం సద్వినియోగం...
జిల్లాలో వానాకాలం సీజన సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా యాసంగిలో 3.50 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తుదన్నారు. రేషన దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసే సమయంలో జిల్లాలో పండిన వడ్ల ద్వారా సీఎంఆర్ రూపంలో సేకరించినవి సరిపోయేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నందున జిల్లాలో వచ్చే దిగుబడి సరిపోవడం లేదు. రేషన దుకాణాల ద్వారా గతంలో దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడంతో చాలా మంది లబ్ధిదారులు దొడ్డు బియ్యం తీసుకుపోయేందుకు నిరాకరించే వారు. రేషన షాపుల వద్ద కిలోకు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల వరకు దొడ్డు బియ్యాన్ని విక్రయించేవారు. దొడ్డు బియ్యానికి బదులుగా రేషన షాపుల ద్వారా సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం అంటే 5,38,82,127 కిలోల అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన సన్నరకం వడ్లను ఎక్కువ శాతం బహిరంగ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. దీంతో సన్న బియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడక తప్పడం లేదు. ప్రస్తుతం మూడు నెలల కోటాకు సంబంధించి సన్న బియ్యం సరఫరా చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే...
- జితేందర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లయి అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి మూడు నెలల రేషన బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. లబ్ధిదారులకు మూడు నెలలకు కోటా బియ్యం అందజేస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశాము. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాము.