ఎల్‌నినోపై ముందస్తు ప్రణాళిక
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:09 AM
ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉండటంతో జిల్లా యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే జల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూనే శాశ్వత నీటి వనరులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వివిధ శాఖలను సమన్వయం చేస్తోంది.
- ఉపాధిపనులతో జల సంరక్షణకు కార్యాచరణ
- యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు..
- తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
పెద్దపల్లి, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉండటంతో జిల్లా యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే జల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూనే శాశ్వత నీటి వనరులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వివిధ శాఖలను సమన్వయం చేస్తోంది. మంత్రులు, కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించారు.
ఫ వర్షపాతం లోటుతో అప్రమత్తం....
జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. జూన్ 1 నుంచి అక్టోబరు 27 వరకు సాధారణంగా 940.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 863.0 మిల్లీమీటర్లు కురిసింది. దీంతో 8 శాతం లోటు నమోదైంది. జిల్లాలోని 14 మండలాలకుగాను జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, మంథని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణం కంటే 42 శాతం అధిక వర్షపాతం నమోదైనా ఆగస్టులో 51 శాతం లోటు ఏర్పడింది. ఎండల తీవ్రత, భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని రానున్న వేసవిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు.
ఫ ఉపాధితోపాటు జల సంరక్షణకు పెద్దపీట
వీబీజీరామ్‌జీ పథకాన్ని జల సంరక్షణకు అనుసంధానం చేశారు. కేవలం కూలీలకు పనులు కల్పించడమే కాకుండా భవిష్యత్తులో గ్రామాలకు ఉపయోగపడే శాశ్వత నీటి వనరులను సృష్టించేలా పనుల ఎంపిక చేపడుతున్నారు. ఫామ్పాండ్లు, ఇంకుడు గుంతలు, సామూహిక సోక్పిట్లు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు, వర్షపు నీటి నిల్వ పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లా లోని 263 గ్రామ పంచాయతీల పరిధిలో 1.18 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వాటి ద్వారా 2.38 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. వీరిలో 1.06 లక్షల మంది క్రియాశీల కార్మికులుగా ఉన్నారు. వీరికి గ్రామాల్లో పనులు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.
ఫ తెలంగాణ జలసిరితో జలకళ....
వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకించే లక్ష్యంతో తెలంగాణ జలసిరి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,144 ఫామ్పాండ్లు, 7890 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 230 సామూహిక సోక్పిట్లు, 65 బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. పొలాల్లో ఫామ్పాండ్లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. బోరుబావుల వద్ద రీఛార్జ్ నిర్మాణాలతో వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలమట్టం పెరిగేందుకు దోహదపడుతుంది. ఇళ్ల వద్ద, గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపడుతున్నారు.
ఫ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయం....
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సాగుపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న రబీ సీజన్లో ఎస్సారెస్పీ నుంచి వ్యవసాయానికి నీటి విడుదల సాధ్యం కాని పరిస్థితులు ఉండటంతో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. రబీ సీజన్లో జిల్లాలో 2,43,601 ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి 1,53,586 ఎకరాల సాగు విస్తీర్ణాన్ని ప్రతిపాదించారు. పప్పుధా న్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని రైతులకు అవగా హన కల్పిస్తున్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని గత ఏడాది 726 ఎకరాల నుంచి ఈసారి 1490 ఎకరాలకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్ల తోటల సాగుతోపాటు డ్రిప్, స్ర్పింక్లర్, మల్చింగ్ పద్ధతులను విస్తరించనున్నారు.
ఫ తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు...
వేసవిలో పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కార్యాచరణ రూపొందించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 17.62 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నవంబరు 15 నుంచి డిసెంబర్ 31 వరకు క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టనున్నారు. చేతిపంపులు, విద్యుత్ మోటార్లు, పైపులైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల పనితీరును పరిశీలించి అవసరమైన మరమ్మతు చేయనున్నారు. ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేపట్టనున్నారు. జిల్లాలోని 373 ఆవాసాలకు 353 ఆవాసాలను సురక్షితమైనవిగా గుర్తించారు. మిగిలిన ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి 1916 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.
ఫ విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురైతే అదే రోజు మార్చేలా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 862 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 35 కొత్త 11 కేవీ ఫీడర్లను ఏర్పాటు చేశారు. రానున్న యాసంగి, వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.
ఫ ఆటాపాటలతో ప్రజల్లో చైతన్యం....
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు బృందాలుగా ఏర్పడిన కళాకారులు రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ ఆటపాటలు, కళారూపాల ద్వారా నీటి పొదుపు, ఆరుతడి పంటల సాగు, విద్యుత్ ఆదా, వర్షపు నీటి సంరక్షణపై ప్రజలకు వివరిస్తున్నారు.