Share News

అదనంగా దోపిడీ

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:21 AM

ఇదీ.. గృహాలకు సరఫరా చేసే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌కు సంబంధించిన రసీదు. నిబంధనల ప్రకారం 1,014 రూపాయలు చెల్లించాలి. ఇంటికి సరఫరా చేసిన డెలివరీ బాయ్‌ 1,050 రూపాయలు దర్జాగా వసూలు చేస్తాడు. అసలు ధరకన్నా 36 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. ఇదేంటి అంటే.. అదంతేననే సమాధానమిస్తాడు. ఇలా కరీంనగర్‌ జిల్లాలో పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఒక్కో సిలిండర్‌పై 36 నుంచి 46 రూపాయల వరకు పై అంతస్తులను బట్టి నిర్బంధంగా అదనపు డబ్బులను తీసుకుంటున్నారు.

అదనంగా దోపిడీ

- సిలిండర్‌ సరఫరాకు రూ. 40 వరకు వసూలు

- ఇవ్వకుంటే పంపిణీలో జాప్యం

- వినియోగదారుల జేబుకు చిల్లు

- నెలకు రూ.54 లక్షల ఆర్థిక భారం

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

ఇదీ.. గృహాలకు సరఫరా చేసే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌కు సంబంధించిన రసీదు. నిబంధనల ప్రకారం 1,014 రూపాయలు చెల్లించాలి. ఇంటికి సరఫరా చేసిన డెలివరీ బాయ్‌ 1,050 రూపాయలు దర్జాగా వసూలు చేస్తాడు. అసలు ధరకన్నా 36 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. ఇదేంటి అంటే.. అదంతేననే సమాధానమిస్తాడు. ఇలా కరీంనగర్‌ జిల్లాలో పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఒక్కో సిలిండర్‌పై 36 నుంచి 46 రూపాయల వరకు పై అంతస్తులను బట్టి నిర్బంధంగా అదనపు డబ్బులను తీసుకుంటున్నారు.

ఫ అధికారుల పర్యవేక్షణలోపం

పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు శాపంగా మారుతోంది. రాయితీ సిలిండర్ల సరఫరాలో ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. నిబంధనల్ని అతిక్రమిస్తున్నా.. ఏ ఒక్కరిపైన నిఘా పెట్టడం లేదు. ఇదంతా మామూళ్ల వ్యవహారమనే విధంగా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బాహాటంగానే అదనపు వసూళ్లు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకునే విషయంలో యంత్రాంగం వెనుకడుగు వేస్తోంది. మొక్కుబడి తనిఖీలు చేపట్టడం.. వస్తున్న ఫిర్యాదులకు సరిగ్గా స్పందించకపోవడంతో గ్యాస్‌ వినియోగదారులు ప్రతీ నెల అదనపు దోపిడీకి గురవుతున్నారు.

ఫ నెలకు అరకోటికిపైగా..

జిల్లాలో నెలకు సగటున గ్యాస్‌ సిలిండర్లకు అసలు బిల్లుకన్నా అదనంగా వసూలు చేసే మొత్తం 54 లక్షలకుపైగా ఉంటోంది. జిల్లావ్యాప్తంగా గృహావసరాల గ్యాస్‌ కనెక్షన్లు 1,67,943 ఉన్నాయి. వీటితోపాటు దీపం కనెక్షనలు 38,157 వరకున్నాయి. ఉజ్వల కనెక్షనలు 24,236 ఉండగా సీఎస్‌ఆర్‌కింద మరో 16,634, ఇతర కేటగిరీల్లో 468 కనెక్షన్లున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా జిల్లాలో 2,47,438 కనెక్షన్లకుగానూ నెలలో ఎంతలేదన్నా 1,50,000 సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌కు 36 అదనంగా వసూలు చేసినా ఈ మొత్తం 54 లక్షలు అవుతుంది. ఇలా ఏడాదికి వీటి ద్వారానే 6.48 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 27 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా అందరూ ఇదే పంథాలో దోపిడీని కొనసాగిస్తున్నారు.

ఫ ఫిర్యాదులకు స్పందనేది..?

వాస్తవంగా ఏ గ్యాస్‌ ఏజెన్సీదారు అయినా వారు ఇళ్ల వద్దకు సరఫరా చేసే గ్యాస్‌కు సంబంధించి డెలివరీ బాయ్స్‌తో అదనంగా వసూళ్లు చేయకూడదు. జిల్లాలో ఇది నిత్యకృత్యంగా మారింది. ఎవరన్నా.. డీలర్లను నిలదీస్తే తమకు సంబంధం లేదనే దాటవేత మాటలే వినిపిస్తున్నాయి. ఒకవేళ పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఆధారాలను అడుగుతుండటం.. లేదా చర్యలు తీసుకుంటామని కాలక్షేపం చేయడమే కనిపిస్తుంది. గతంలో అసలు అదనంగా వసూలు చేయవద్దని పలుమార్లు అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా వసూళ్లను ఆపలేదు. ఏ ఒక్క డీలర్‌పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ అదనపు వసూళ్లతోనే డెలివరీ బాయ్స్‌ జీతభత్యాలను ఏజెన్సీ నిర్వాహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు వేతనాలు, వాహనాల భారాన్ని తగ్గించుకునేందుకు పంపిణీ చేసే బాయ్స్‌కు ఎలాంటి జీతాలు ఇవ్వకుండా సరఫరా బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. పంపిణీ చేసిన సిలిండర్లపై అదనంగా వచ్చే డబ్బులను డెలివరీ బాయ్స్‌ తీసుకునే విధంగా ఒప్పందాల్ని కుదుర్చుకున్నారు. బహుళ అంతస్తుల్లో ఉన్న వారికి సిలిండర్‌ను చేరవేసే సమయంలో 10 రూపాయలు అదనంగా అడిగితే ఇవ్వొచ్చు. అందరికీ ఇలా నిర్బంధంగా ఇంత మొత్తాన్ని పక్కాగా చెల్లించాలనే రూల్‌ పెట్టడం సరికాదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి అదనపు బాదుడులకు పాల్పడుతున్న వారిపై తగు చర్యల్ని తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 23 , 2026 | 01:21 AM