Share News

విద్యాలయాల్లో కార్యక్రమాలను నమోదు చేయాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:20 AM

ప్రగతి పోర్టల్‌ కింద అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు.

విద్యాలయాల్లో కార్యక్రమాలను నమోదు చేయాలి

సిరిసిల్ల టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : ప్రగతి పోర్టల్‌ కింద అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రగతి పోర్టల్‌పై విద్యాధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా పాఠశాల విద్యా శాఖకు చెందిన సమగ్ర శిక్ష, పిఎం పోషణ్‌ అభియాన్‌, అపార ఐడీ మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ అపార్‌ ఐడీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యమైనది విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యాలయాల్లోని విద్యార్థులకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయించేందుకు షెడ్యూల్‌ సిద్దం చేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా కావాల్సిన మరుగుదొడ్లు మధ్యాహ్న భోజన గదుల కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. విద్యాలయాల ఆవరణ అలాగే మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే వంటశాల, భోజనం చేసే స్థలాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ కాకుండా చూడాలని ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని విద్యాయాలయాల్లో అడ్మిట్‌ చేయించాలని ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాప్‌లో విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను నమోదు చేయాలన్నారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని విద్యాలయాల్లో తనిఖీలు చేయాలని విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, వివిధ మండలాల విద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:20 AM