ఆస్తి పన్ను చెల్లించకుంటే చర్యలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:49 PM
ఆస్తిపన్నులను సకాలంలో చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తామని, స్పందించకపోతే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ హెచ్చరించారు.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్నులను సకాలంలో చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తామని, స్పందించకపోతే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ హెచ్చరించారు. ఆయన శనివారం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సుల వసూలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, నల్లా బిల్లులు, ఇతరత్రా పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. మార్చి 31వ తేదీతో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున ఇంటి పన్నులను వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టిపెట్టి వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. రెడ్ నోటీ సులు ఇవ్వాలని, స్పందించకపోతే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలోని వ్యాపార సంస్థలు విధిగా ట్రేడ్ లైసెన్సు తీసుకోవాలని, గడువు అయిపోయిన వారు రెన్యూవల్ చేయించుకోవాలన్నారు.