Share News

నిబంధనలు అతిక్రమిస్తే వేటు..

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:25 AM

ఎన్నో కేసులు సక్సెస్‌ చేశామంటూ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం చేయించుకునే ప్రకటనలకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) చెక్‌ పెట్టింది.

నిబంధనలు అతిక్రమిస్తే వేటు..

జగిత్యాల, అక్టోబరు13 (ఆంధ్రజ్యోతి): ఎన్నో కేసులు సక్సెస్‌ చేశామంటూ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం చేయించుకునే ప్రకటనలకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) చెక్‌ పెట్టింది. కొంత మంది కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు రోగులను ఆకట్టుకునేందుకు చికిత్స చేయించు కున్న వారి అనుభవాలతో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వివిధ స్పెషలిస్టు వైద్యులు తాము చేసే చికిత్సల విజయాలను చెప్పుకుంటూ పరోక్షంగా ప్రకటనలను గుప్పిస్తుంటారు. ఇంకొంతమంది రోగులకు సర్జరీ చేయక ముందు, చేసిన తర్వాత ఎలా ఉంటారో చూపేందుకు వారి క్లినిక్‌, నర్సింగ్‌హోమ్‌లలో పెద్ద అక్షరాలతో బొమ్మలతో పరోక్షంగా ప్రచారం చేసుకుంటారు. అవి కూడా కళ్లకు అద్దినట్లుగా రకరకాల రంగులతో దర్శనమిస్తుంటాయి. ఆర్థోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ, స్కిన్‌ తదితర క్లినిక్‌లలో ప్రచారం చేసుకోవడానికి ఇదో మార్గంగా ఎంచుకుం టుంటారు. ఇక నుంచి ఇలాంటి వాటికి ప్రైవేట్‌ వైద్యులు దూరంగా ఉండాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారు 350 ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఫమార్గదర్శకాలు విడుదల

ఆయా ఆసుపత్రుల వైద్యులు చేసే ప్రకటనలు, డిజిటల్‌ ప్రచారాలపై కఠినమైన మార్గదర్శకాలను ఈనెల 6వ తేదీ నుంచి జాతీయ వైద్య మండలి అమల్లోకి తీసుకొచ్చింది. వైద్య సేవలను వాణిజ్యపరంగా ప్రచారం చేయడం, వైద్యపరంగా తప్పుడు హామీలు ఇవ్వడం నిషేధంగా చెబుతోంది. వైద్య వృత్తిని కాపాడుకోవడానికి, రోగుల ప్రయోజనాలను పరిరక్షించడం లక్ష్యంగా పలు మార్గదర్శకాలు రూపొందించినట్లు ఎన్‌ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.

ఫప్రచారాలకు దూరంగా ఉండాలి..

ఆయా ఆసుపత్రులు సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లు, వాట్సాప్‌, ఇన్‌ఫ్లుయన్సర్‌ మార్కెంటింగ్‌, డిజిటల్‌ ప్రచారాలు, స్పాన్సర్డ్‌ పోస్టుల, ఏఐ ఆధారిత ప్రచారాలు కూడా నిబంధనల పరిధిలో ఉన్నాయి. రోగుల ఫొటోలతో ప్రచారం చేయకూడదంటున్నారు. పేషంట్ల చికిత్స ముందు, చికిత్స తర్వాత పేరుతో ఫొటోలు వాడడం నిషేధించారు. ఇటీవల కాలంలో టీవీల్లో అధికంగా కనిపిస్తున్న చికిత్స పొందిన రోగుల ఫొటోలు, వీడియోలు, వైద్య రికార్డులు, క్లినికల్‌ చిత్రాలు, వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రకటనలను నిషేధించింది.

ఫవ్యక్తిగత ప్రచారం బంద్‌..

కొంత మంది ప్రైవేటు వైద్యులు వ్యక్తిగత విజయాలు, చికిత్స అందించిన రోగుల సంఖ్య, సాధించిన విజయాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు సైతం నిషేధించారు. ఇక బెస్ట్‌ డాక్టర్‌, నంబర్‌ వన్‌ డాక్టర్‌, నంబర్‌ వన్‌ స్పెషలిస్టు, వంద శాతం సక్సెస్‌, గ్యారంటేడ్‌ క్యూర్‌, మిరాకిల్‌ ట్రీట్‌మెంట్‌, పెయిన్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌, ఒక్క రోజులో మటుమాయం అనే చికిత్స పేరుతో ప్రచారాలను మానుకోవాల్సి ఉంటుంది. అలాగే రోగులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, కూపన్లు, క్యాష్‌ బ్యాక్‌, బహుమతులు, రిఫరల్‌ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను వాడుకోవద్దని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

ఫఅతిక్రమిస్తే అంతే..

ఎన్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యులపై చర్యలు తప్పవు. మొదటి సారి ఉల్లంఘిస్తే హెచ్చరికతో పాటు తప్పనిసరి నైతిక శిక్షణ పొందాల్సి ఉంటుంది. రెండోసారి మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. మూడో సారి అయితే 3నెలల నుంచి 6 నెలలు రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌ చేస్తారు. తప్పుదోవ పట్టించే చికిత్స హామీలు, రోగులకు ప్రోత్సాహకాలు, భారీ స్థాయిలో డిజిటల్‌ తప్పుడు ప్రచారాలు చేసినట్లు రుజువయితే 6 నుంచి 12 నెలలు సస్పెన్షన్‌ విధించే అవకాశం ఉంది. పదే పదే ఉల్లంఘిస్తే సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పాటు వైద్య రిజిస్టర్‌ నుంచి తొలగించే చర్యలు తీసుకోవచ్చు.

జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల మేరకే...

-సుజాత, డీఎంహెచ్‌వో

ఇటీవల జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. తప్పుడు ప్రచారాలు, డిజిటల్‌ తప్పుడు ప్రచారాలు చేయడాన్ని నిషేధించారు. ఇందుకు అవసరమైన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు వైద్యులు పాటించకుంటే చర్యలు తప్పవు.

Updated Date - Oct 14 , 2026 | 01:25 AM