Share News

నీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:00 AM

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకునేందుకు సంబంధిత అదికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు.

నీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ ప్లాన్‌
ముత్తారం మండలం మచ్చుపేటలో సర్వే చేస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు

- గ్రామాల్లో సర్వే ప్రారంభించిన అధికారులు

- ఇంజినీరింగ్‌, పంచాయతీ అధికారులు కలిసి సర్వే

- తక్షణమే చేయాల్సిన పనులను గుర్తిస్తున్న బృందం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకునేందుకు సంబంధిత అదికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. ముందస్తుగా చేయాల్సిన పనులు, మరమ్మతులను గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు గ్రామాల్లో పర్యటించి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని పది రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లోని 422 ఆవాస ప్రాంతాల్లో ప్రస్తుతం తాగునీటి సరఫరా, రానున్న వేసవిలో నీటి సరఫరా ఎలా ఉంటుందనే విషయమై అంచనాలను సిద్ధం చేయడానికి సమాయత్తం అవుతున్నారు. దీంతోపాటు అందుబాటులో ఉన్న ఇతర నీటి వనరులు, సామర్థ్యాలపైనా దృష్టి సారించనున్నారు. గ్రామాల్లో ప్రతీ నెలా 1, 11, 21వ తేదీల్లో ట్యాంకుల్లో నీటిని తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం చేయనున్నారు. మిషన్‌ భగీరథ ఇంట్రా, గ్రిడ్‌ మండల ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు కలిసి సోమవారం నుంచి సర్వే ఆరంభించారు. ఈ సర్వే 20 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఈనెల 11వ తేదీన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, 13న కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో కొందరు అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేసి అంచనాలను రూపొందించనున్నారు. జిల్లాలో 13 గ్రామీణ మండలాలు ఉండగా, వాటిలో 263 గ్రామ పంచాయ తీలు, 422 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. 1,30,000 ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 706 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ముర్మూర్‌ వద్ద గల ఫిల్టర్‌ బెడ్‌ నుంచి నిత్యం 2066 కిలోమీటర్ల విస్తీర్ణం గల పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా జరగనున్నది. ఇవేగాకుండా 3,457 చేతిపంపులు, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు 589, త్రీఫేజ్‌ మోటార్లు 508, తాగునీటి బావులు 284 ఉన్నాయి. వీటి ద్వారా కూడా గ్రామాల్లో తాగు నీటితో పాటు ఇంటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. సర్వే సందర్భంగా పనిచేయని బోర్లు గుర్తించి గ్రామపంచాయతీ నిధులతో అవసర మైన మరమ్మతులు చేయించనున్నారు. గుర్తించిన వనరుల నుంచి కూడా నీళ్లు సరిపోకపోతే ప్రైవేటు వ్యక్తుల నుంచి నీటిని వేసవి పూర్తయ్యేంత వరకూ అద్దెకు తీసుకోనున్నారు. ఈ వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా మండలాల వారీగా జిల్లా పంచాయతీ అధి కారులు సర్పంచులు, కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించ నున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిషన్‌ భగీరథ నీళ్లు సరఫరా కాని సమయంలో గ్రామాల్లోని నీటి వనరులను వినియోగించేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయనున్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు గుర్తించ డం వాటిని సరి చేయడం గేట్‌ వాల్‌ వద్ద లీకేజీలు గుర్తించడం, మురుగు కాలువల్లో పైపులైన్లు లేకుండా చూడడం వాటిని నివా రించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ విభాగంలో బల్క్‌వాటర్‌ సరఫరా చేసే ప్రధాన పైపులైన్ల విస్తరణ, మరమ్మతులు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పని తీరును కూడా పరిశీలించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి తీవ్రతను అధిగమించేందుకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించిన తర్వాత కొన్ని నిధులను కేటాయించనున్నది

ఫ నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు

- శ్రీనివాస్‌, ఈఈ మిషన్‌ భగీరథ ఇంట్రా

వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నాం. యేటా వేసవిలో ఇబ్బందులు వచ్చే గ్రామాలను సోమవారం నుంచి సర్వే చేస్తున్నాం. ప్రతి ఆవాసానికి వెళ్లి నీటి సరఫరా గురించి సర్వే చేస్తాం. అవసరమైన పనులను గుర్తించి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి ఆ వెంటనే పంచాయతీ నిధులతో పనులు చేపడతాం. ఎక్కడైనా క్రిటికల్‌ గ్యాప్స్‌ ఉంటే ఆ పనుల కోసం కావాల్సిన నిధుల కోసం కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తాం. ఆయా గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

Updated Date - Feb 03 , 2026 | 01:00 AM