ధాన్యం కొనుగోళ్లకు యాక్షన్ ప్లాన్
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:57 AM
ఖరీఫ్ సాగులో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఖరీఫ్ సాగులో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎల్‌నినో విపత్తు కాలంలో రైతులు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకుని వానాకాలం పంటలు వేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.48లక్షల ఎకరాల్లో మీద పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసిన ఎల్‌నినో ప్రభావంతో 2.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసుకున్నారు. జిల్లాలో బోరు బావులతో పంటలను కాపాడుకోవడానికి రైతులు కష్టాలు పడుతున్నారు. దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో ప్రధానంగా వేసిన వరి పంట 1.47 లక్షల ఎకరాల ద్వారా వచ్చే 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పౌరసరఫరాల శాఖ సమాయత్తమైంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వరి గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు రూ 2461, సాధారణ రకానికి రూ 2441 చెల్లిస్తారు. సన్న రకాలకు రూ 500 బోనస్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలో పౌరసరఫరాల కార్పొరేషన్ అక్టోబరు చివరి వారం నుంచి ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేసి అందుకు ఏర్పాట్ల సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో కొనుగోళ్లు దిగుబడి అంచనాపై ఖరీప్ ధాన్యం కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది.
ఫ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంకు సంబంధించి జిల్లాలో 1.47 లక్షల ఎకరాల్లో వరి సాగు ప్రకారం 307832 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనాలు వేసింది. ఇందులో స్థానికంగా ధాన్యం వినియోగించుకొవడం, మిల్లర్లు నేరుగా కొనుగోళ్లు 67832 మెట్రిక్ టన్నులు మినహించి మిగతా 2.40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నారు. ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు అక్టోబరు చివరి వారంలో ధాన్యం వస్తుందని దానికి అనుగుణంగా కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంబిస్తారు..ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివిధ శాఖ ఆధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అక్టోబరులో 25వేల మెట్రిక్ టన్నులు ధాన్యం మార్కెట్‌లో వస్తుందని అందులో పౌరసరఫరాల శాఖ ద్వారా 15 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతుందని అంచనాలు వేశారు. నవంబరులో 92832 మెట్రిక్ టన్నుల్లో 47832 మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల్లో 147168 మెట్రిక్ టన్నులు, 2027 జనవరిలో 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ 500 బోనస్ ఇస్తున్న క్రమంలో రైతులు సన్నరకం వైపు అసక్తి చూపారు. జిల్లాలో 102295 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు కొనుగోలు కేంద్రాలు వారి గ్రామాల్లోనే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకెపీ ద్వారా 132 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 96 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా ఒకటి, మెప్మా ద్వారా 7 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఉపయోగించడానికి 3683000 గన్నీ బ్యాగులు, 7170 టార్పాలిన్‌లు, 15ప్యాడీ క్లీనర్లు, 333 మాయిశ్చరైజ్ మీటర్లు, 630 వేయింగ్ మిషన్లు సిద్దం చేశారు. దీనికి అనుగుణంగానే రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ 2.23 లక్షల ఎకరాల్లో వానకాలం సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి ఎల్‌నినో ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ముందస్తుగానే పంటల సాగుపై రైతులను హెచ్చరిస్తూ అవగాహన కల్పించిన వానకాలం సీజన్‌లో ఆశల సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 2.48 లక్ష ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావంతో మండల సాగు తగ్గుతుందని భావించిన రైతులు కేవలం 20 వేల ఎకరాల వరకే సాగు తగ్గించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ప్రధానంగా వరి 147500 ఎకరాలు, పత్తి 50275 ఎకరాలు, మొక్కజొన్న 4500 ఎకరాలు, కంది 2800 ఎకరాలు, ఇతర పంటలు 18646 ఎకరాల్లో సాగు చేశారు.ఇందులో వరి సాగులో ఇప్పటి వరకు గంభీరావుపేటలో 15554 ఎకరాల్లో నాట్లు వేసుకోగా ఇల్లంతకుంటలో 18600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 18273 ఎకరాలు, సిరిసిల్లలో 3910 ఎకరాలు, తంగళ్లపల్లిలో 16600 ఎకరాలు, వీర్నపల్లిలో 5219 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16363 ఎకరాలు, బోయినపల్లిలో 11836 ఎకరాలు, చందుర్తిలో 12800 ఎకరాలు, కోనరావుపేటలో 15200 ఎకరాలు, రుద్రంగిలో 2350 ఎకరాలు, వేములవాడలో 3300 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 8212 ఎకరాల్లో సాగు జరిగింది.