మ్యూల్ ఖాతాలపై చర్యలు...
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:05 AM
సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, బాధ్యులపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, బాధ్యులపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని డివిజన్ల ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో సమగ్ర నేర సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల పరిష్కార (డిస్పోజల్) వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ఇప్పటికే గుర్తించిన 29 బ్యాంక్ బ్రాంచ్‌ల ఆధారాల మేరకు బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు. రానున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని, ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలన్నారు. పాత కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాలన్నారు. దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఫ టపాసుల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
దీపావళి పండుగను పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకున్న వ్యాపారులు ఈ నెల 17లోగా దరఖాస్తులు సమర్పించాలని సీపీ గౌస్ ఆలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన వారికి అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. వ్యాపారులు నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు ఐదు సెట్ల జిరాక్స్ ప్రతులను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అక్టోబర్ 17లోపు సమర్పించాలని సూచించారు. నిర్ణీత దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి మార్కుల మెమో, ప్రభుత్వ చలాన్ (రూ. 600), సంబంధిత ప్రభుత్వ శాఖల (ఫైర్, రెవెన్యూ/మున్సిపల్) నిరభ్యంతర పత్రాలు(ఎన్‌ఓసీ)లను సమర్పించాలన్నారు.
ఫ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...
నివాస ప్రాంతాల్లో, సాధారణ వాణిజ్య దుకాణాల మధ్య లేదా అనుమతి లేని ప్రదేశాల్లో బాణసంచా అమ్మితే ఉపేక్షించేది లేదని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించినా, పరిమితికి మించి నిల్వ చేసినా లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.