Share News

ప్రాజెక్టులు వేగవంతం చేయండి

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:33 AM

ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

ప్రాజెక్టులు వేగవంతం చేయండి

కరీంనగర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత డబ్బు అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపించి అవసరమైన ఆర్థిక అనుమతులు, టోకెన్లు పొందాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్‌ పనులు కొనసాగిస్తూనే భూసేకరణ, భూయజమానులకు పరిహారం చెల్లింపు, భూ నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం చెల్లించే ప్రక్రియ సమాంతరంగా సాగాలని ఆయన సూచించారు. ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటి ఫలితాలను రైతులకు అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు.

ఫ ‘పత్తిపాక’పై దృష్టి సారించండి..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చేపట్టిన శ్రీలక్ష్మినర్సింహస్వామి పత్తిపాక రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు చెందిన 10 వేల ఎకరాలకు ఈ రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందతుంన్నారు. కాకతీయ ప్రధాన కాలువ డి-83 నుంచి డి-94 వరకు ఉన్న 2.4 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం ఈ పథకం లక్ష్యమన్నారు. పత్తిపాక వద్ద మూడు టీఎంసీలు లేదా ఐదు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించే రెండు ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నామని, లైడార్‌ సర్వే డేటా ప్రాసెసింగ్‌ ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. బోర్‌హోల్‌ డ్రిల్లింగ్‌ ట్రయల్‌ పిట్స్‌, జియో టెక్నికల్‌ పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆగస్టు నెలాఖరులోగా డీపీఆర్‌ సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

ఫ మిడ్‌ మానేరు ఎడమ కాలువ పనులను ప్రారంభించండి

నాలుగున్నర సంవత్సరాలుగా నిలిచిపోయిన మిడ్‌ మానేరు ఎడమ కాలువ పనులను పునఃప్రారంభించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భూసమస్యలను పరిష్కరించి అంచనాలను సవరించి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భూసేకరణ టెండర్ల ప్రక్రియ, అనుమతుల సాధన ఏకకాలంలో సాగాలని ఆయన సూచించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 96శాతం పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచాలని ఆదేశించారు. బండ్‌-2లోని కొంత భాగం అటవీభూమిలో ఉండడంతో అనుమతులు రావలసి ఉందని, ప్రత్యామ్నాయ అటవీకరణకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించి వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన మిటిగేషన్‌ ప్లాన్‌కు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. మిగిలిన అనుమతులను వెంటనే పొందాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతుల కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు నిలిచిపోయినా వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి డి శ్రీదర్‌బాబు, బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఓవీ రమేశ్‌బాబు, నీటిపారుదలశాఖ జాయింట్‌ సెక్రెటరీ కె శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:33 AM