అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:05 AM
అభివృద్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయడంలో వేగం పెంచండి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ) ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన నిర్వహించగా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానికసంస్థల అదనపుకలెక్టర్ రాజాగౌడ్, డీఆర్‌డీవో రఘువరన్, జడ్పీసీఈవో గౌతమ్‌రెడ్డి, అదనపు ఎస్‌పీ చేతన్‌నితిన్ తదితరులు హాజరయ్యారు.
- అధికారుల పనితీరు మరింత మెరుగుపడాలి
- సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ)లో నిజామాబాద్ ఎంపీ అరవింద్
జగిత్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయడంలో వేగం పెంచండి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ) ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన నిర్వహించగా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానికసంస్థల అదనపుకలెక్టర్ రాజాగౌడ్, డీఆర్‌డీవో రఘువరన్, జడ్పీసీఈవో గౌతమ్‌రెడ్డి, అదనపు ఎస్‌పీ చేతన్‌నితిన్ తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి పనుల నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అధికారులు నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు. అభివృద్ధి పనుల నిర్వహణను నిర్ణీత లక్ష్యం మేరకు అధికారులు పూర్తి చేయాలని అన్నారు. పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన పరిష్కార విషయాలను రానున్న మూడు మాసాల్లో సమీక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. అమృత్2.0 పథకం, సమగ్రశిక్ష అభియాన్, నేషనల్ హైవేస్, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హెల్త్ స్కీం, జాతీయక్షయ నిర్మూలన కార్యక్రమం, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, తదితర వాటిపై సమీక్షించారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అధికారుల పనితీరుపై అసంతృప్తి..
జిల్లాలో జాతీయ రహదారుల అబివృద్ధి అంశంలో అధికారుల పనితీరుపై ఎంపీ అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌నుంచి జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం మీదుగా మంచిర్యాల వరకు విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి63, జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి 563పనులు నత్తనడకన సాగుతుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్ల పనుల్లో ప్రగతి కనిపించడం లేదని అసంతృప్తి తెలిపారు. ఆర్మూర్ - మంచిర్యాల నాలుగు లేన్ల జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, కాంట్రాక్టర్ ఎంపిక ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. మరో రెండునెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున అప్పటిలోగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ పరిహార చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేసి, సేకరించిన భూమిని వెంటనే సంబంధిత శాఖకు అప్పగించాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదకర ప్రాంతాల(డార్క్ స్పాట్స్) తొలగింపునకు కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని అన్నారు. కేంద్రప్రభుత్వ ఆర్‌అండ్‌బీ శాఖ పనితీరు పేలవంగా, అసంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి సంబంధించి రోడ్లు భవనాలశాఖ అధికారులు చురుకుగా సమన్వయం చేసి వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిర్లక్ష్యం చేస్తే నోటీసులు జారీ చేయాలి..
ఇకపై ప్రతి సమావేశంలో ప్రాజెక్టు వారీగా భౌతిక, ఆర్థిక పురోగతి, వ్యయవివరాలను సమర్పించాలని అధికారులను ఎంపీ అర్వింద్ ఆదేశించారు. పనులు చేపడుతున్న ఏజెన్సీలతో అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాజకీయ కారణాలతో బిల్లులు ఆపొద్దు..
గ్రామీణ, పట్టణ, స్థానికసంస్థల్లో 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై ఫిర్యాదులు అందుతున్నాయని అర్వింద్ తెలిపారు. పూర్తయిన పనులకు రాజకీయ ప్రమేయం లేకుండా వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఏ ప్రజాప్రతినిధి లేదా వ్యక్తి కోసం ఎదురుచూస్తూ వాయిదా వేయరాదని స్పష్టం చేశారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటిస్తూ, ప్రజలకు ఉపయోగపడే పనులను సకాలంలో ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. మంజూరైన అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు.
కేంద్రీయ విద్యాలయానికి 10ఎకరాలు కేటాయించాలి..
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తప్పనిసరిగా 10ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్ సత్యప్రసాద్‌కు సూచించారు. అంతకంటే తక్కువ విస్తీర్ణంలో కేవీస్కూల్ నిర్వహించడం ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాలపై విస్తృత అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేగంగా పనులు పూర్తి చేయాలి..
- కలెక్టర్ సత్య ప్రసాద్
అమృత్2.0 పథకం కింద జగిత్యాలలో రూ.38.60కోట్లు, కోరుట్లలో రూ.41.50కోట్లు, మెట్‌పల్లిలో రూ.19.40కోట్లు, రాయికల్‌లో రూ.15.20కోట్లు, ధర్మపురిలో రూ.23కోట్ల వ్యయంతో తాగునీటి సరఫరా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9ఓవర్ హెడ్‌సర్వీస్ రిజర్వాయర్లు, సుమారు 165కిలోమీటర్ల పైప్‌లైన్, గృహనీటి కనెక్షన్ల పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వం గడువును డిసెంబర్2026 వరకు పొడిగించిందని, అప్పటిలోగా అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అమృత్ 2.0 కింద పట్టణ స్థానిక సంస్థల్లో రూ. 18.80 కోట్ల వ్యయంతో ఆరు చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు, వాటిని జూన్ 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద జగిత్యాలలో రూ.20లక్షలతో ఆస్పిరేషనల్ టాయిలెట్ బ్లాక్, కోరుట్లలో రూ.2.17 కోట్లతో టాయిలెట్ బ్లాక్, యంత్రాల కొనుగోలు, మెట్‌పల్లిలో రూ.3.30కోట్లతో వివిధ పారిశుధ్య పనులు కొనసాగుతున్నట్లు వివరించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో దిశ కమిటీ సభ్యులు వడ్డెపల్లి శ్రీనివాస్, భిక్యా నాయక్, పాతరమేష్, ఎర్ర లక్ష్మి, వివిధ ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.