ఏబీవీపీ పాఠశాలల బంద్ సక్సెస్
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:07 AM
అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాఠశాలల బంద్ జిల్లాలో విజయవంతమైంది.
కరీంనగర్ టౌన్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాఠశాలల బంద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలన్ని స్వచ్ఛందంగా మూసివేయగా, ప్రభుత్వ పాఠశాలలు తెరిచారు. ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపిచారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ముకాస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా పాఠశాలల బంద్ నిర్వహించామన్నారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు లేక నిర్వీర్యమవుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే, ప్రైవేట్ విద్యాసంస్థల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామన్న హామీ నీటిమూట అ్యయిందని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు ఉచితంగా అందించే విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పాఠశాల విద్యపై దృష్టిసారించి, సమస్యల పరిష్కారంలో చొరవచూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బామండ్ల నందు, ముసరి మురళి, విగ్నేష్, వంశీ, విష్ణు, కార్యకర్తలు ఆకాష్, సాయి, కౌశిక్, రిషి పాల్గొన్నారు.