Share News

నేతలకు పరీక్ష..

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:48 AM

బల్దియా ఎన్నికలు నేతలకు పరీక్షగా మారింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలు ప్రధాన పార్టీల నేతల ఉనికికి సవాల్‌గా మారింది.

నేతలకు పరీక్ష..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

బల్దియా ఎన్నికలు నేతలకు పరీక్షగా మారింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలు ప్రధాన పార్టీల నేతల ఉనికికి సవాల్‌గా మారింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఇప్పటికే వెల్లడైన వార్డుల రిజర్వేషన్లతో ఆశావహుల సందడి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతల్లో టెన్షన్‌ పెంచుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పార్టీలరహితంగా జరిగినప్పటికీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుతోనే అభ్యర్థులు బరిలో దిగారు. గెలుపొందిన అభ్యర్థుల్లో దాదాపుగా సగం సగం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఉన్నారు. పార్టీ గుర్తులు లేకపోవడంతో ఎవరికి వారు తమదే ఆధిపత్యంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరగబోయే సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం పార్టీల గుర్తులతోనే అభ్యర్థులను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. దీంతో రెండు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఇతర పార్టీల బలాబలాలు తేలనున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో విభిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, వేములవాడలో ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌లకు మున్సిపల్‌ ఎన్నికలు వారి ప్రాబల్యానికి ప్రామాణికంగా మారనున్నాయని చర్చించుకుంటున్నారు. రెండు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి.

సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ దూకుడు

అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడల్లో బీఆర్‌ఎస్‌ పాగా వేసింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధికారంలో లేకపోయినా రెండు మున్సిపాలిటీలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో ప్రధానంగా సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికలను బీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతోనే అందరి చూపు సిరిసిల్ల మున్సిపల్‌ వైపు ఉంది. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 24 గంటలు సిరిసిల్లలో మకాం వేసి మున్సిపల్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. వార్డు ఇన్‌చార్జీలను నియమించి సర్వే రిపోర్టులను తెప్పించుకున్నారు. సిరిసిల్లలో 29 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో వారితో విడివిడిగా చర్చించారు. పార్టీ నాయకులు, ఆశావహులు కొంతమేరకు ఇబ్బందిపడినా గెలుపు గుర్రాలనే బరిలో దింపే దిశగా కేటీఆర్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చీటీ నర్సింగరావు, గూడూరి ప్రవీణ్‌, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్‌లతో పాటు సీనియర్‌ నాయకులు మున్సిపల్‌ ఎన్నికలపై ప్రధాన దృష్టి పెట్టారు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూకుడుగా ప్రచారం ప్రారంభించారు. టికెట్ల కోలాహలం కొనసాగుతుండగా కాంగ్రెస్‌ మాత్రం ఇంకా హడావుడి పెరగలేదు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. ఇటీవల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రక్రియపై ఇంకా స్పష్టత కనిపించడం లేదు. కొన్ని వార్డుల్లో ఆశావహులు పెద్దల చుట్టూ తిరుగుతున్న వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆశావహులతో సమావేశం నిర్వహించినా నామమాత్రంగానే మిగిలింది. బీజేపీ మున్సిపాలిటీలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని తపనతో ఉంది. నూతనంగా నియామకమైన జిల్లా అధ్యక్షుడు గోపి అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

వేములవాడలో కాంగ్రెస్‌ వ్యూహం..

వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. గతంలో బీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కొనసాగిన వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆది శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ప్రభుత్వ విప్‌గా ఉండడంతో ఆ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారాయి. వేములవాడలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడంతో మున్సిపాలిటీలో పాగా వేసే దిశగా ఆది శ్రీనివాస్‌ దృష్టి పెట్టారు. వేములవాడ అభివృద్ధితో పాటు వ్యక్తిగత సంబంధాలతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. దీంతో కాంగ్రెస్‌లో ఆశావహుల తాకిడి పెరిగినట్లుగా కనిపిస్తోంది. వేములవాడలో 28 వార్డుల నుంచి ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తుండడంతో వారిని ఎంపిక చేయడం కూడా తలనొప్పిగానే మారినట్లుగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వవిప్‌గా వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసి తోటి ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు తన ప్రతిష్టతను చాటుకునే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఉనికిని యథావిధిగా నిలిపే దిశగా వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుకొచ్చిన పోటీదారుల బలాలు బలహీనతలపై సర్వేలు కూడా చేయించినట్లు తెలిసింది, దీంతో వేములవాడలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ వేములవాడలో పట్టు నిలుపుకునే దిశగానే పావులు కదుపుతోంది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి పెట్టిన జిల్లాలో బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం ఆ పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందనే భావన వ్యక్తం అవుతోంది.

ఆశావహులకు టికెట్‌ గుబులు

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోని 67 వార్డు ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీలకు 3, బీసీలకు 15, జనరల్‌ 20 రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం కోటా నిర్ణయించింది. ఆ ప్రకారం 12వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. మూడు ఎస్సీ రిజర్వ్‌ కోటాలో 1వ వార్డు, 22వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 8వ వార్డు మహిళకు, బీసీలకు 15వార్డులు రిజర్వ్‌ కాగా, బీసీ మహిళలకు 3, 4, 5, 10, 31, 38, 39 వార్డులు, బీసీ జనరల్‌ కింద 2, 7, 11, 13,14, 16, 17, 20, వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ వార్డుల్లో జనరల్‌ మహిళ రిజర్వ్‌లో 6, 9, 15,18, 23, 27, 28, 29, 30,36,37 వార్డులు, జనరల్‌ వార్డుల్లో 19, 21, 24,25,26, 32,33,34, 35 కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఎస్టీ జనరల్‌గా 12వ వార్డు, ఎస్సీ రిజర్వేషన్‌లో ఎస్సీ మహిళకు 3, 13, వార్డులు, ఎస్సీ జనరల్‌గా 17, 20 వార్డులు, బీసీల రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 1, 11, 23, 27 వార్డులు, బీసీ జనరల్‌గా 8, 15, 16, 21, 24 వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ కోటాలో జనరల్‌ మహిళలలకు 2, 5, 9, 10, 19,22, 26, 28 వార్డులు, జనరల్‌గా 4, 6, 7, 14, 18, 25 వార్డులును కేటాయించారు. తమకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన ఆశావహులు టికెట్‌ కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రత్యర్థికి దీటైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అనూహ్యంగా పార్టీలకు సంబంధం లేకుండా కొత్తవారు ముందుకు రావడం.. పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉండడంతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిలో టికెట్‌ గుబులు పట్టుకుంది. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతోనే అన్ని పార్టీలు అభ్యర్థులను పోటీకి సిద్ధం చేస్తున్నాయి.

Updated Date - Jan 24 , 2026 | 12:48 AM