Share News

బోరింగ్‌ యజమానుల సిండికేట్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:59 AM

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని రిగ్‌ మిషన్ల యజమానులు సిండికేట్‌ అయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోతుండడం, పేదలకు గూడు కట్టించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు ఊపందుకోవడాన్ని ఆసరాగ తీసుకున్న రిగ్‌ యజమా నులు రేట్లను ఒక్కసారిగా 20శాతం పెంచారు. అదనపు ఖర్చుల భారం పెరగకున్నా కూడా యజమానులు సిండికేట్‌ అయ్యి రేట్లు పెంచారు.

బోరింగ్‌ యజమానుల సిండికేట్‌

- 20శాతం పెంచిన బోర్‌వెల్స్‌ నిర్వాహకులు

- ఇందిరమ్మ లబ్ధిదారులపై బోర్ల భారం

- డ్రిల్లింగ్‌ల మోసాలతో కుచ్చుటోపీ

- అనుమతులు లేకుండా వేస్తున్న యజమానులు

కోల్‌సిటీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని రిగ్‌ మిషన్ల యజమానులు సిండికేట్‌ అయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోతుండడం, పేదలకు గూడు కట్టించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు ఊపందుకోవడాన్ని ఆసరాగ తీసుకున్న రిగ్‌ యజమా నులు రేట్లను ఒక్కసారిగా 20శాతం పెంచారు. అదనపు ఖర్చుల భారం పెరగకున్నా కూడా యజమానులు సిండికేట్‌ అయ్యి రేట్లు పెంచారు. ఒక్కో ఫీట్‌కు రూ.20 నుంచి రూ.40వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కో బోర్‌కు కనిష్టంగా రూ.15వేల నుంచి గరిష్టంగా రూ.50వేల అదనపు భారం పడనున్నది. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మంథని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి తదితర ప్రాంత రిగ్‌ యజమానులు కుమ్మక్కై రేట్లు పెంచారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నాలుగున్నర అంగులాల బోర్‌కు ఫీట్‌కు రూ.110 నుంచి రూ.120 తీసుకునే వారు. కొన్ని సందర్భాల్లో రూ.100లకు కూడా బోర్లు వేసేవారు. ఇప్పుడు ఏకంగా రూ.140 చేశారు. 100అడుగుల వరకు రూ.140, 101 నుంచి 200అడుగుల వరకు రూ.150, 201 నుంచి 300అడుగుల వరకు రూ.170, 300 నుంచి 400 అడుగుల వరకు రూ.210 ఈ విధంగా రేట్లు పెంచు కుంటూ పోయారు. దీనితోపాటు ప్రాంతాల వారీగా అదనంగా రూ.10 రేటు పెంచారు. ట్రాన్స్‌పోర్ట్‌, బస్తా చార్జీలను అదనంగా పెట్టారు.

యజమానులు, ఏజెంట్ల దోపిడీలు...

రిగ్‌ యజమానులు, ఏజెంట్లు కుమ్మక్కై ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారు. అమాయకు లను చూసి బోర్‌వెల్‌ ఖరీదు, కేసింగ్‌ ఖరీదుల పేర లెక్కలు కట్టి చుక్కలు చూపిస్తున్నారు. పెరిగిన రేట్లతో అదనంగా రూ.15వేల నుంచి రూ.60వేల వరకు భారం పడుతుంది. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోనే కొత్తగా 1100 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు బోర్‌వెల్‌ వేయించుకుని నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో కనిష్టంగా 250 నుంచి గరిష్టంగా 1000 అడుగుల వరకు బోర్‌ తవ్వకాలు జరుపాల్సి ఉంటుంది. దీంతో బోర్లు, కేసింగ్‌ల పేర ఒక్కో బోరుకు రూ.60వేల నుంచి రూ.2.5లక్షల వరకు బిల్లులు వేస్తున్నారు.

లూస్‌ కేసింగ్‌ పేర దోపిడీ

బోర్ల యజమానులు, ఏజెంట్లు కుమ్మక్కై లూస్‌ కేసింగ్‌ పేర వినియోగదారులను దోచేస్తున్నారు. సాధా రణంగా 20ఫీట్ల లూస్‌ కేసింగ్‌ వేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను 12అంగులాల రంధ్రాలు వేసి 10 అంగులాల కేసింగ్‌ వేస్తారు. కానీ వినియోగదారులకు తెలియకుండా తొమ్మిదిన్నర అంగులాల రంధ్రాలను 40 అడుగుల లోతు వరకు వేసి బోర్లు 500 అడుగులు వేసిన తరువాత కూలుతుందంటూ వినియోగదారులను గబరా పెట్టిస్తున్నారు. 10అంగులాల లూస్‌ కేసింగ్‌తో పాటు 7అంగులాలు, 5అంగులాల కేసింగ్‌ను అదనంగా వేసి లక్షలు దండుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వేసిన లోతుకంటే అదనంగా లెక్కలు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. నాణ్యత లేని కేసింగ్‌ పైపులు వేసి బ్రాండెడ్‌ పైపుల పేర లక్షల బిల్లులు వేస్తున్నారు.

అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా బోర్లు...

ఎల్‌నినో ప్రభావంతో బోర్లు వేయాలంటే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మీ సేవాల్లో దరఖాస్తులు చేయాలని జీవో ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా యజమానులు, ఏజెంట్లు అనుమతులు తీసుకోవడం లేదు. ఇష్టానుసారంగా మున్సిపల్‌ రహదారులు, సీసీ రోడ్లపైనే బోర్లు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక చోట బోర్‌ వేస్తే పక్కింట్లో బోర్లకు నీరుపోవడం, మైనింగ్‌ ఏరియాలు కుంగడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

పట్టించుకోని అధికారులు

నిబంధనలు తుంగలో తొక్కి ఎల్‌నినో పరిస్థితుల్లో ఇందిరమ్మ లబ్ధిదారులు, సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్న రిగ్‌ యజమానులు, ఏజెంట్ల దోపిడీపై అధికారులు స్పందించడం లేదు. నిబంధనలను అమలు చేయడం లేదు. కొందరు రిగ్‌ యజమానులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు కోల్‌బెల్ట్‌ జిల్లాల్లో యేటా కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచి లబ్ధిదారులను దోపిడీకి గురి చేస్తున్న రిగ్‌ యజమానుల ఆగడాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Nov 24 , 2026 | 12:59 AM