ఓటరుకు ‘సర్’ పరీక్ష
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:27 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు రాజకీయ పార్టీలు తమ ఓటర్లు జాబితా నుంచి తొలిగిపోకుండా అప్రమత్తమవుతుం డగా, మరోవైపు ఈ ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
- ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ
- జూలై 14 వరకు ఇంటింటికి బీఎల్‌వోలు
- సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
- జిల్లాలో మొత్తం ఓటర్లు 7,21,032
- ఇప్పటి వరకూ 78.75 శాతం మ్యాపింగ్ పూర్తి
జగిత్యాల, జూన 16 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు రాజకీయ పార్టీలు తమ ఓటర్లు జాబితా నుంచి తొలిగిపోకుండా అప్రమత్తమవుతుం డగా, మరోవైపు ఈ ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్ అంటే కేవలం మ్యాపింగ్ ప్రక్రియ మాత్రమే కాదు... కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు, చిరునామాల మార్పుపై కూడా జరుగుతోంది. అవగాహన, అప్రమత్తతతోనే ఓటు హక్కును పరిరక్షించుకోగలము.
భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రచారం పరిమితంగానే ఉండడంతో, అనేక మంది ఓటర్లు నిర్లక్ష్యం చేస్తే ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2002 ప్రాతిపదిక ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకొని సమగ్ర సవరణ చేపడుతున్నారు. ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటరు నమోదు, వివరాల సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది.
- ఇంటింటికీ బీఎల్‌వోలు..
జిల్లావ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బూతస్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన ఫారాలను పంపిణీ చేసి నింపిన వివరాలను తిరిగి సేకరిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన ఫారం-2ను రెండు ప్రతుల్లో అందజేస్తారు. ఫారం ఎలా నింపాలో బీఎల్‌వోలు వివరించి, నింపిన ఫారాన్ని తిరిగి స్వీకరిస్తారు. రెండు ప్రతుల్లో ఒక దాన్ని బీఎల్‌వో తీసుకొని, మరొక దాన్ని రశీదుగా ఓటరుకు అందజేస్తారు. బీఎల్‌వో వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే ఫారాన్ని అక్కడే ఉంచుతారు. అనంతరం మూడుసార్లు వరకు తిరిగి సందర్శించి నింపిన ఫారాన్ని స్వీకరిస్తారు. అవసరమైతే ఫారాన్ని ఆనలైనలో డౌనలోడ్ చేసుకొని నింపి అప్‌లోడ్ చేయడంతోపాటు బీఎల్‌వోకు కూడా అందజేసే అవకాశం కల్పించారు.
- జూలై 21న ముసాయిదా జాబితా..
జూలై 21వ తేదీన ఓటరు జాబితాలను విడుదల చేస్తారు. ఆరోజు నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులను సెప్టెంబరు 18వ తేదీ లోపు పరిశీలించి పరిష్కరిస్తారు. ముసాయిదా జాబితా విడుదల అనంతరం వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నవారికి లేదా కాని వ్యక్తులకు ఓటరు నమోదు అధికారి నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత వ్యక్తులకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబరు 22వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.
- మ్యాపింగ్ పూర్తి కాకపోతే ఇబ్బందులే..
ప్రతీ ఓటరు వివరాలు మ్యాపింగ్ కావాల్సి ఉంటుంది. మ్యాపింగ్ పూర్తి కానివారు సంబంధిత బీఎల్‌వోను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం బీఎల్‌వో ఇచ్చే ఫారాన్ని పూర్తిగా నింపి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. మ్యాపింగ్ కాని ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. జిల్లాలో 7,21,032 మంది ఓటర్లుండగా ఇప్పటివరకు 5,67,785 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 1,53,247 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉంది.
- ఓటర్ల తొలగింపుపైనా చర్చ...
సర్ ప్రక్రియలో భాగంగా చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారు, చిరునామా మారిన వారు, గుర్తించలేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. అయితే ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే అర్హులైన సజీవ ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత జాబితాలో కనీసం 10 శాతం వరకు ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7,21,032 మంది ఓటర్లున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతీ ఓటరు తమ వివరాలు సక్రమంగా నమోదు అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
- ఫారం- 2 నింపడం సవాలే...
సర్ కార్యక్రమంలో ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన ఫారం-2ను పూరించి సమర్పించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, కూలీ పనులకు వెళ్లే కార్మికులు, వృద్ధులకు ఈప్రక్రియ కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు పట్టణాల్లో పలువురు యువతీయువకులు, ఇతరులు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడం, విదేశాలకు వెళ్లడం వంటివి ఉన్నాయి. సంబంధిత వ్యక్తులు సకాలంలో ఫారం-2 నింపి అందించాలి అంటే కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలుండడంతో ఆందోళన చెందుతున్నారు. సమయానికి ఫారం అందకపోవడం, సరైన సమాచారం నింపకపోవడం లేదా బీఎల్‌వోను సంప్రదించకపోవడం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు కూడా జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.