రైతు భరోసాకు మోక్షం
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:03 AM
రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం రైతుభరోసా ఆర్థికసాయం విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం రైతుభరోసా ఆర్థికసాయం విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ సీజన్‌కు ఇంకా ఆశలు వదులుకోవలసిందేననే అభిప్రాయం రైతుల్లో కలిగింది. ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యక్తమవుతున్న నిరసనను గమనించిన తర్వాత ఈ నెల 22 నుంచి ఈసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట మూడు విడతలుగా ఏప్రిల్ నెలాఖరునాటికి రైతులందరికీ రైతుభరోసా అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే మూడు విడతల పంపిణీ పట్ల పలు పార్టీలు, రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తూ మొదటి విడత ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించి ఆ తర్వాత చేతులెత్తేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ఒకే విడతలో వారంరోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వారికున్న విస్తీర్ణం మొత్తానికి డబ్బు చెల్లించాలని నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
ఫ 3,15,780 ఎకరాల్లో పంటల సాగు
ఈ రబీలో జిల్లాలో 2,72,000 ఎకరాల్లో వరి, 30,000 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 13,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మొత్తం 3,15,780 ఎకరాల్లో వివిధ పంటలుసాగవుతాయని అంచనా వేశారు. ఈ అంచనాల మేరకు వరి, మొక్కజొన్న, ఇతర ప్రధానపంటలు 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు అయ్యాయి. 2024-25 యాసంగిలో 2,09,450 మంది రైతులకు 213.74 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బ్యాంకు ఖాతాలు తదితర వివరాలను అందించని కారణంగా 200.73 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేసేందుకు ట్రెజరీకి పంపించారు. 2025-26 వానాకాలం సీజన్‌లో 2,10,904 మంది రైతులకు 211 కోట్ల 90 లక్షల 69వేల రూపాయలు సాయాన్ని అందించారు. ప్రస్తుతం 2 లక్షల 10వేల మందికిపైగా రైతులు 210 కోట్లపై చిలుకు రైతుభరోసా సాయాన్ని పొందనున్నారు. రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల కొనుగోళ్ల కోసం, అలాగే పెట్టుబడుల కోసం పంట రుణాలు అందక, అందినా సరిపోక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకొని నష్టపోతున్నారని ఆ పరిస్థితిని నివారించేందుకు ప్రతి వానాకాలం, రబీ సీజన్‌లలో కనీసం విత్తనాలు, ఎరువులకు సరిపడే విధంగానైనా పెట్టుబడి సహాయాన్ని అందించాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట పథకాన్ని ప్రారంభించింది. తొలుత ఈ పథకం కింద ఒక్కో ఎకరాకు ఒక్కో సీజన్‌కు 5వేల రూపాయల చొప్పున సహాయం అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఒక సీజన్‌కు మాత్రమే ఈ సహాయాన్ని అందించారు. 2023లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధు సహాయం రైతులకు అందకుండా పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల తర్వాత 2024లో ఒక విడత సహాయాన్ని అందించింది. 2025 జనవరి 26న రైతుబంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చి ఎకరాకు 6వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ సంవత్సరం రెండు సీజన్‌లకు సరిగానే సహాయాన్ని విడుదల చేసినా ఈ రబీ సీజన్‌కు మాత్రం ఇంకా నిధులు విడుదల చేయలేదు. ప్రస్తుతం రబీ సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా సాయాన్ని ఈ నెల 22 నుంచి ప్రారంభించి వారంరోజుల్లోగానే రైతులందరి ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమైనా సహాయం అందుతున్నదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.