విద్యార్థినులకు అభయహస్తం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:37 AM
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జగిత్యాల, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి భద్రతకు భరోసా కల్పిస్తూ అభయహస్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. ప్రతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని సీపీవో (చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్)గా నియమించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ సరికొత్త రక్షణ వ్యవస్థ అమల్లోకి రానుంది. వేధింపులకు గురై లోలోన కుమిలిపోయే వారు సీపీఓకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇకపై పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా విద్యార్థినుల రక్షణ బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 220 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, గత విద్యా సంవత్సరంలో 35,586 మంది విద్యార్థులు అభ్యసించారు.
ఫవారానికో ప్రత్యేక తరగతి నిర్వహణ
ప్రతీ పాఠశాలలో చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు వారానికి ఒక క్లాస్ తప్పనిసరిగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందులో రాజ్యాంగ విలువలు, పోక్సో యాక్ట్ తదితర కీలక చట్టాల గురించి విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించనున్నారు. ప్రతీ స్కూల్‌లో లీగల్ లిటరసీ క్లబ్ లేదా చైల్డ్ రైట్స్ క్లబ్ ఏర్పాటు చేసి సెమినార్లు, పోటీల ద్వారా విద్యార్థినులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతారు.
ఫమూడు నెలలకోసారి ఉన్నతాధికారుల సమీక్ష
జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి, మండల స్థాయిలో మండల విద్యాధికారిని నోడల్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. ప్రతీ మూడు నెలలకొకసారి వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో నమోదైన కేసులను పరిష్కరిస్తూ విద్యార్థినుల రక్షణ చర్యలు పర్యవేక్షిస్తారు. దీని అమలుకు అందుబాటులో ఉన్న వనరులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల నియామకంతో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు అభిప్రాయ పడుతున్నారు.
సీపీవోలు నిర్వహించే విధులు..
ఫ బాల కార్మిక వ్యవస్థ నుంచి విద్యార్థినులను రక్షించడం
ఫ బాల్య వివాహాలను అరికట్టడం
ఫ విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురికాకుండా చర్యలు చేపట్టడం
ఫవేధింపులకు గురయ్యే విద్యార్థినుల సమస్య నేరుగా తెలుసుకోవడం
ఫబాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచి వారికి అవసరమైన న్యాయ సహాయం అందించడం
ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమిస్తాం
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సీపీవోలను నియమిస్తాం. న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పిస్తాం. నిర్భయంగా సీపీవోలకు ఇబ్బందులు చెప్పుకొనేలా విద్యార్థినులను ప్రోత్సహిస్తాం.
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇలా..
---------------------------------------------------------------------------
యాజమాన్యం... సంఖ్య.... విద్యార్థుల సంఖ్య
---------------------------------------------------------------------------
ప్రభుత్వ / లోకల్ బాడీ - 189 - 22,909
కేజీబీవీలు - 16 - 3,312
టీజీఎంఎస్ - 13 - 8,214
టీజీఆర్‌ఈఎస్ - 2 - 1,151
---------------------------------------------------------------------------
మొత్తం - 220 - 35,586
---------------------------------------------------------------------------