Share News

దొడ్డు బియ్యానికి మోక్షం..

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:18 AM

జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని తరలిం చేందుకు మోక్షం లభించింది. పదిహేడు నెలలుగా రేషన్‌ షాపుల్లోనే ఉన్న బియ్యాన్ని తీసుకుని వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో టెండర్‌ ప్రకటన విడుదల చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

దొడ్డు బియ్యానికి మోక్షం..

- 17 నెలల్లో అధికారుల్లో కదలిక

- వేలం వేయాలని ఆదేశాలు

- బేసిక్‌ ధర కిలోకు రూ.21.60

- జిల్లాలో 6460 క్వింటాళ్ల నిల్వలు

- రికార్డుల్లో ఉన్న ప్రకారమే ఇవ్వాలంటున్న అధికారులు

- అదేలా సాధ్యమని ఆందోళన చెందుతున్న డీలర్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని తరలిం చేందుకు మోక్షం లభించింది. పదిహేడు నెలలుగా రేషన్‌ షాపుల్లోనే ఉన్న బియ్యాన్ని తీసుకుని వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో టెండర్‌ ప్రకటన విడుదల చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఆయా రేషన్‌ షాపుల్లో రికార్డుల ప్రకారం ఏ మేరకు బియ్యం నిల్వ ఉన్నాయో, అంతే మొత్తంలో తిరిగి వాపస్‌ ఇవ్వాలని అధికారులు చెబుతుండడంతో రేషన్‌ డీలర్లు ఆందోళన చెందు తున్నారు. చాలా షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కిపోవడంతో పాటు రంగు మారాయి. పురుగు పట్టి పిండిగా మారగా, కొన్ని షాపుల్లో ఎలుకలు, పందికొక్కులు బియ్యం బుక్కడంతో పాటు చాలా వరకు తరుగు పోయాయి. తరుగుతో సంబంధం లేకుండా బియ్యం ఇవ్వాలని చెబుతుండడం విస్మయానికి గురి చేస్తున్నదని రేషన్‌ డీలర్లు అంటున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌ వినియోగదారులకు సన్న బియ్యం ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రైతులు సన్న రకం ధాన్యాన్ని సాగు చేసే విధంగా క్వింటాలు ధాన్యా నికి 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. ధాన్యం ప్రభు త్వానికి చేరిన తర్వాత 2025 ఏప్రిల్‌ నుంచి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. అయితే అప్పటి వరకు రేషన్‌ షాపుల్లో మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వాపస్‌ తెప్పించుకోలేదు.

ఫ జిల్లాలో 6,460 క్వింటాళ్ల నిల్వలు..

పౌరసరఫరాల శాఖాధికారుల రికార్డుల ప్రకారం జిల్లాలో 410 రేషన్‌ షాపులు ఉండగా, ఆ షాపుల్లో దొడ్డు బియ్యం 6,460 క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి. వాటిని నిల్వ చేసేందుకు స్థలం లేక రేషన్‌ డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డు బియ్యం బస్తాలు షాపుల్లోనే ఉండడంతో కొత్త బియ్యం నిల్వ చేసేందుకు స్థలం సరిపోక ఇబ్బందులు పడ్డారు. కొన్ని దుకాణాల్లో బస్తాలను ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచామని డీలర్లు చెబుతున్నారు. దీంతో నిర్వహణ కూడా భారంగా మారిందని, పంపిణీకి పనికిరాని స్థితికి చేరుకున్న ఈ బియ్యం వల్ల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి నిరుపయోగంగా మారిందన్నారు. ఒకవైపు ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు పాత నిల్వలను పట్టించుకోక పోవడంతో ప్రజాధనం వృథా అవుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. తమ వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వాపస్‌ తీసుకోవాలని పలుసార్లు రేషన్‌ డీలర్లు సంబంధిత శాఖాధికారులకు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారని డీలర్లు తెలి పారు. ఈ బియ్యం ఇతరత్రా అవసరాలకు తప్ప ప్రజలు తినేందుకు పనికి రావని చెబుతున్నారు. ఎట్టకేలకూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు దిగి వచ్చి ఎక్కడికక్కడే జిల్లాల వారీగా దొడ్డు బియ్యాన్ని టెండర్లు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. పౌరసరఫరాల శాఖాధికారుల రికార్డుల ప్రకారం డీలర్ల వద్ద 6,460 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా వరకు డీలర్ల వద్ద దొడ్డు బియ్యం ముక్కి పోయాయి. పురుగు పట్టి పిండిగా మారడంతో బయట పారబోశారు. కొన్ని ఎలుకలు, పందికొక్కుల పాలయ్యాయి. 2025 మార్చిలో రేషన్‌ షాపులకు సరఫరా చేసిన బియ్యంలో ఎంతైతే నిల్వలు ఉన్నాయో, అంతే తిరిగి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో డీలర్లు గగ్గోలు పెడుతున్నారు.

ఫ చాలా వరకు బియ్యం డ్యామేజీ అయ్యాయి..

- గాండ్ల రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి మండల రేషన్‌ డీలర్ల సంఘం

ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయక ముందు తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని వాపస్‌ తీసుకోవాలని చాలాసార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చాం. పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. చాలా వరకు బియ్యం పురుగు పట్టి పాడయ్యాయి. రికార్డుల ప్రకారం బియ్యం ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. రంగు మారి తినేందుకు కూడా పనికి రావు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచన చేసి తమ వద్ద ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకోవాలి.

Updated Date - Aug 22 , 2026 | 01:18 AM