Share News

స్వశక్తి ఓట్లకు గాలం..

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:52 AM

జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళా ఓట్లే కీలకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిరిసిల్ల. వేములవాడ మున్సిపాలిటీల్లో మహిళలే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా 283 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 141 మంది మహిళలు పోటీలో ఉన్నారు.

స్వశక్తి ఓట్లకు గాలం..

- రెండు మున్సిపాలిటీల్లో 3,068 స్వశక్తి సంఘాల్లో 31,353 మంది ఓటర్లు

- ఓట్లు, సీట్లలో మహిళల పోటాపోటీ

- మునిసిపల్‌ ఎన్నికల్లో ఆమెదే తీర్పు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళా ఓట్లే కీలకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిరిసిల్ల. వేములవాడ మున్సిపాలిటీల్లో మహిళలే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా 283 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 141 మంది మహిళలు పోటీలో ఉన్నారు. 50 శాతం రిజర్వేషన్లను అందిపుచ్చుకున్న మహిళలు మరోవైపు ఓట్ల సంఖ్యలోనూ ముందంజలోనే ఉన్నారు. జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు పోటీ పడుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో జనరల్‌ స్థానాల్లో మహిళలు పోటీలో ఉన్నారు. వేములవాడలో బీసీ జనరల్‌ కావడంతో బీసీ మహిళలు సైతం చైర్మన్‌ స్థానంపై దృష్టి పెట్టారు. సిరిసిల్ల వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో వారిని ఆకర్షించడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.

స్వశక్తి ఓట్ల పైనే ఆశలు..

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో ఇందులో 1,22,836 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది ఉన్నారు. పురుషుల ఓట్ల కంటే 5,467 మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. రెండు మున్సిపాలిటీల్లో 63,290 మంది మహిళా ఓటర్లు ఉండగా వీరిలో స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 3068 ఎస్‌హెచ్‌జీ సంఘాలు ఉండగా, వీటిలో 31,353 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులందరూ ఓటు హక్కు కలిగిన వారే ఉండడంతో వారి ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు ప్రధాన దృష్టి పెట్టారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 2,197 మహిళా సంఘాలు ఉండగా 22,146 మంది సభ్యులు, వేములవాడలో 871 సంఘాలు ఉండగా 9,207 మంది సభ్యులు ఉన్నారు. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సంఘాల లీడర్లతో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకోవడానికి అభ్యర్థులు కసరత్తు ప్రారంభించారు. స్వశక్తి సంఘాల ద్వారా సభ్యులకు నజరానాలు అందించి ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు. మహిళా సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరిపే విధంగా ఆయా పార్టీల మహిళా సంఘాల లీడర్లను రంగంలోకి దింపారు. అభ్యర్థులు స్వశక్తి సంఘాల ఓట్లను రాబట్టుకోవచ్చని ద్వారా సులువుగా గెలుపొందవచ్చని భావిస్తున్నారు.

అధికంగా మహిళా ఓటర్లే..

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళల తీర్పు కీలకంగా మారింది. రెండు మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళా ఓటర్ల 5,467 మంది అధికంగా ఉన్నారు. రెండు మున్సిపాలిటీలో 1,22,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59,522 మంది, మహిళలు 63290 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3,768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81,959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942 మంది, మహిళలు 42,011 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40,877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580 మంది, మహిళలు 21,279 మంది, ఇతరులు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,699 మంది ఎక్కువగా ఉన్నారు.

సతుల కోసం పతుల కష్టాలు

సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీల్లో మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు జనరల్‌ స్థానాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలో రిజర్వేషన్లు మహిళకు కేటాయించిన వార్డుల్లో పతులు తమ సతీమణులను రంగంలో నిలిపి శ్రమిస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని తపనతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మహిళలకు రిజర్వ్‌ కావడంతో గెలుపు కోసం పోటీ పడుతున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డుల్లో 33 వార్డులు మహిళలకు రిజర్వేషన్‌ చేశారు. రిజర్వేషన్‌ వాటితో పాటు జనరల్‌ వార్డులు కలిపి 141 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 39 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీలకు 3, బీసీలకు 15, జనరల్‌ 20 రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం కోటా నిర్ణయించగా, దాని ప్రకారం 12వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. మూడు ఎస్సీ రిజర్వ్‌ కోటాలో 1వ వార్డు, 22వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 8వ వార్డు మహిళకు, బీసీలకు 15వార్డులు రిజర్వ్‌ కాగా బీసీ మహిళలకు 3, 4, 5, 10, 31, 38,39 వార్డులు, బీసీ జనరల్‌ వార్డుల్లో 2, 7, 11, 13,14, 16, 17, 20, వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ వార్డుల్లో జనరల్‌ మహిళ రిజర్వ్‌లో 6, 9, 15,18, 23, 27, 28, 29, 30,36,37 వార్డులు, జనరల్‌ వార్డుల్లో 19, 21, 24,25,26, 32,33,34, 35 కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌గా 12వ వార్డు, ఎస్సీ రిజర్వేషన్‌లో ఎస్సీ మహిళకు 3, 13, వార్డులు, ఎస్సీ జనరల్‌గా 17, 20 వార్డులు, బీసీల రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 1, 11, 23, 27 వార్డులు, బీసీ జనరల్‌గా 8, 15, 16, 21, 24వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ కోటాలో జనరల్‌ మహిళలకు 2, 5, 9, 10, 19,22, 26, 28 వార్డులు, జనరల్‌ వార్డులుగా 4, 6, 7, 14, 18, 25 వార్డులు ఉన్నాయి. వీటిలో మహిళలు కీలంగా మారారు.

Updated Date - Feb 07 , 2026 | 12:52 AM