ముదిరిన వివాదం
ABN , Publish Date - May 15 , 2026 | 01:02 AM
జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
జగిత్యాల, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించే వ్యవహారంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ల మధ్య వివాదం నెలకొంది. ఎంపీ అర్వింద్ చొరవతో జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ గత యేడాది అక్టోబరులో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా అందులో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. జిల్లా కేంద్రం సమీపంలోని చల్‌గల్ వాలంతరీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసుతో గతంలో కలెక్టర్ సత్యప్రసాద్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. స్థలాన్ని కేటాయించే విషయంలో ప్రభుత్వం వద్ద తీవ్ర జాప్యం ఏర్పడింది. ఈ వ్యవహారంలో నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈనెల 15 లోపు స్థల కేటాయింపు కొలిక్కి రాకుంటే ఈనెల 18న జగిత్యాలలో ధర్మ దీక్ష పేరిట ఎంపీ అర్వింద్ నిరసన చేపట్టడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను రప్పించడానికి కసరత్తులు జరుగుతున్నాయి.
ఫవాలంతరీ స్థలంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు..
జిల్లా కేంద్రానికి సమీపాన జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చల్‌గల్ వాలంతరి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తొలుత ప్రతిపాదించారు. సుమారు ఐదు ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయ భవన సముదాయం నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే స్థల కేటాయింపు చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. స్థల కేటాయింపులో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి జాప్యం చేస్తున్నారంటూ గతంలో ఎంపీ అర్వింద్ ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లను కలిసి కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని కోరారు. పలు పర్యాయాలు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినప్పటికీ కేంద్రీయ విద్యాలయ స్థల సేకరణలో చోటుచేసుకున్న జాప్యం తొలగలేదు. చల్‌గల్ స్థలం కేటాయింపులో జాప్యం చోటుచేసుకోవడంతో ఎమ్మెల్యే సంజయ్ స్వగ్రామమైన అంత ర్గాంలో స్థలాన్ని కేటాయించాలన్న మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఫఎమ్మెల్యే సంజయ్‌పై బీజేపీ నేతల ఆరోపణలు..
ఎమ్మెల్యే సంజయ్ స్వార్థ ప్రయోజనాల కోసం చల్‌గల్ వద్ద స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో నాలుగు నెలలుగా ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సంస్థకు స్థలం కేటాయించడం లేదని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్‌లో కాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే ఇతర ప్రాంతంలో స్థల సేకరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డే స్కూల్‌గా బోధన జరిగే కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల రాకపోకలకు అనువుగా ఉండే చల్‌గల్‌లో ఏర్పాటు చేయాల్సి ఉందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెండు రోజుల క్రితం తీవ్రంగా స్పందించారు. కేంద్రీయ విద్యాలయం స్థల కేటాయింపునకు నిస్వార్థంగా ప్రయత్నాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. అకారణంగా తనను వివాదాల్లోకి లాగవద్దని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు.
ఫ దీక్షకు హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపులో నెలకొన్న జాప్యాన్ని వ్యతిరేకిస్తూ జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో ధర్మదీక్ష పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించడానికి బీజేపీ పిలుపునిచ్చింది. జగిత్యాలలోని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్మ దీక్ష నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ప్రకటించారు. ధర్మదీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమయ్యేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో కేంద్రీయ విద్యాలయ స్థల కేటాయింపు వ్యవహారం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫవచ్చే విద్యా సంవత్సరం తరగతులు మొదలయ్యేనా..?
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, తరగతుల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి బోధన జరిపేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే స్థల కేటాయింపులోనే వివాదం చోటుచేసుకోవడంతో తాత్కాలిక భవనంలోనైనా కేంద్రీయ విద్యాలయం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. విద్యాలయంలో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఇస్తారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందన్న అభిప్రాయాలున్నాయి. విద్యాలయం ఏర్పాటుపై రాజకీయ స్వార్థ ప్రయోనాలు మానుకొని తరగతుల ప్రారంభంపై ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చల్‌గల్‌లో స్థలం కేటాయించాలి
-ధర్మపురి అర్వింద్, ఎంపీ, నిజామాబాద్
కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చల్‌గల్ వాలంతరీలో కేటాయించాలి. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి కోసం పనిచేయాలి. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం స్థలాన్ని కేటాయించడం లేదు. డే స్కూల్ తరహాలో కేంద్రీయ విద్యాలయం నిర్వహించనుండడంతో అందరికీ అనుకూలమైన ప్రాంతంలో నిర్మాణం జరగాలి.
ధర్మదీక్ష పేరిట బీజేపీ నాటకం
-సంజయ్ కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు వ్యవహారంలో ధర్మదీక్ష పేరిట బీజేపీ రాజకీయ నాటకానికి పాల్పడుతోంది. వాలంతరీలో స్థలం కేటాయించడానికి పలు పర్యాయాలు మంత్రులను, ఇతర ప్రభుత్వ పెద్దలను కలిసి రాతపూర్వకంగా వినతిపత్రాలను అందజేశా. అనివార్య కారణాల వల్ల స్థలం కేటాయింపులో ఆలస్యం అవుతోంది. చల్‌గల్‌లో విద్యా సంస్థల ఏర్పాటుకు కట్టుబడి పనిచేస్తున్నా.