22ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:56 PM
రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జిల్లా వేగంగా చర్యలు చేపట్టిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
సుభాష్‌నగర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జిల్లా వేగంగా చర్యలు చేపట్టిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన సమగ్ర నివేదిక, ప్రతిపాదనలను ఇప్పటికే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ)కు పంపించామని వెల్లడించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన 22ఏ బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ తన ఛాంబర్‌లో బాధితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రేకుర్తి పరిధిలోని 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య 50 ఏళ్లుగా ఉందన్నారు. ఈ సమస్యను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో వారి వారసులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తూ సీసీఎల్‌ఏకు నివేదిక పంపించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు రేకుర్తి 22ఏ బాధితుల సమస్యపై సానుకూల వైఖరితో ఉన్నారని తెలిపారు. రేకుర్తి 22ఏ భూముల విషయంలో కొంతమంది వ్యక్తులు, వివిధ వేదికల ద్వారా వ్యక్తం చేస్తున్న సందేహాలు, అపోహలపై బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, సమస్య తీవ్రతను గుర్తించి, ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరంగా తెలియజేయడంపై రేకుర్తి 22ఏ బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రెవిన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.