ఖరీఫ్‌కు ఊపిరి..
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:04 AM
ఎల్‌నినో విపత్తు కాలంలో ఖరీఫ్ సాగు కష్టాలు ఎదుర్కొంటున్న అన్నదాతలకు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆశలు కల్పిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఎల్‌నినో విపత్తు కాలంలో ఖరీఫ్ సాగు కష్టాలు ఎదుర్కొంటున్న అన్నదాతలకు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆశలు కల్పిస్తోంది. నైరుతి వర్షాలు ముఖం చాటేసి ఆందోళన మిగిలిన క్రమంలో అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు చేతికందే పరిస్థితులు లేవని ఎండిపోతున్న వరి, వాడిపోతున్న పత్తి, మొక్కజొన్న పంటలకు సోమవారం అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ప్రభావానికి జిల్లాలో కురుస్తున్న వర్షపు జల్లులు పంటలకు జీవం పోస్తున్నాయి. వర్షాకాలం వర్షాలను మరిచి రైతులు తుఫాన్ వానల కోసమే ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సోమవారం అల్పపీడన ప్రభావంతో గంభీరావుపేటలో 35.3 మిల్లీమీటర్ల వర్షం కురువగా కోనరావుపేటలో 22.5 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 16.8 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 13.3 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 10.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాత్రి ఎల్లారెడ్డిపేటలో 27.6 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 13.8 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 9.6 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 6.7 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 4.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వానాకాలంలో పంటలు నష్టాన్ని మిగులుస్తాయని ఆందోళన చెందుతున్న రైతులకు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు కొంతమేరకైనా దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడుగా బోరు బావుల నుంచి సాగునీరు అందించడానికి కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 వేల వ్యవసాయ బోరుబావులతోనే పంటలకు నీరు అందిస్తారు. అనధికారికంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుడంతో రైతులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలు, లో-వోల్టేజీ సమస్యతో రైతులు గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రం పొలాలకు నీళ్లు అందించలేక వదిలేస్తున్నారు.
జిల్లాలో 2.23 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి ఎల్‌నినో ప్రభావం రైతుల మీదనే కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ముందస్తుగానే పంటల సాగుపై రైతులను హెచ్చరిస్తూ అవగాహన కల్పించిన వానకాలం సీజన్‌లో ఆశల సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 2.48 లక్ష ఎకరాల్లో వీళ్ల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావంతో మండల సాగు తగ్గుతుందని భావించిన రైతులు కేవలం 20 వేల ఎకరాల వరకే సాగు తగ్గించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ప్రధానంగా వరి 147500 ఎకరాలు, పత్తి 50275 ఎకరాలు, మొక్కజొన్న 4500 ఎకరాలు, కంది 2800 ఎకరాలు, ఇతర పంటలు 18646 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి సాగులో ఇప్పటి వరకు గంభీరావుపేటలో 15554 ఎకరాల్లో నాట్లు వేసుకోగా, ఇల్లంతకుంటలో 18600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 18273 ఎకరాలు, సిరిసిల్లలో 3910 ఎకరాలు, తంగళ్లపల్లిలో 16600 ఎకరాలు, వీర్నపల్లిలో 5219 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16363 ఎకరాలు, బోయినపల్లిలో 11836 ఎకరాలు, చందుర్తిలో 12800 ఎకరాలు, కోనరావుపేటలో 15200 ఎకరాలు, రుద్రంగిలో 2350 ఎకరాలు, వేములవాడలో 3300 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 8212 ఎకరాల్లో సాగు జరిగింది. పత్తి సాగు గంభీరావుపేటలో 120 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12750 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1050 ఎకరాలు, సిరిసిల్లలో 700 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1400 ఎకరాలు, వీర్నపల్లిలో 450ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3300 ఎకరాలు, బోయినపల్లిలో 720ఎకరాలు, చందుర్తిలో 6500 ఎకరాలు, కోనరావుపేట 5100 ఎకరాలు, రుద్రంగిలో 2230 ఎకరాలు, వేములవాడలో 5200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4300 ఎకరాల్లో సాగు చేశారు.
లోటు నుంచి సాధారణ వర్షపాతానికి..
జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో వర్షపాతం నుంచి సాధారణ వర్షపాతం నమోదు అవుతుంది. సోమవారం వరకు జిల్లాలో సగటు వర్షపాతం 677.0 సాధారణ వర్షపాతానికి 681.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతం సాధారణ స్థితిలో ఉంది. రుద్రంగిలో 729.0 సాధారణ వర్షపాతం 517.0 వర్షం కురువగా 29 శాతం లోటుగా ఉంది. చందుర్తిలో 754 మిల్లీమీటర్ల వర్షపాతానికి 597 మిల్లీమీటర్లు కురిసింది.29 శాతం లోటుగా ఉంది. జిల్లాలో మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతంగా నమోదయింది. వేములవాడ రూరల్‌లో 726.3 మిల్లీమీటర్ల వర్షపాతానికి 640.5 మిల్లీమీటర్లు, బోయిన్‌పల్లిలో 648.6మిల్లీమీటర్ల వర్షపాతానికి 650.5 మిల్లీమీటర్లు, వేములవాడలో 754.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి 822.5 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో711.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి 656.5 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 634.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి 762.9మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 683.8 మిల్లీమీటర్ల వర్షపాతానికి 762.5 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 670.3మిల్లీమీటర్ల వర్షపాతానికి 852.2మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 641.6మిల్లీమీటర్ల వర్షపాతానికి 639.7మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 581.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి 565.3మిల్లీమీటర్లు, తంగళ్ళపల్లిలో 719.8 మిల్లీమీటర్ల వర్షపాతానికి 772.7మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 883.6మిల్లీమీటర్ల వర్షపాతం 613.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులోకి నీళ్లు చేరాయి. సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగులు ప్రవహించాయి. ప్రస్తుతం మిడ్ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 22.875టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులోకి గాయత్రి పంప్ హౌస్ ద్వారా 2690 క్యూసెక్కుల నీళ్లు నింపుతుండగా మానేరు వాగు నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు చేరుతున్నాయి. అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీలకు 1.56 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎగువ మానేరు ప్రాజెక్టులో రెండు టీఎంసీలు పూర్తి సామర్థ్యంతో నీళ్లు నిలువ ఉండి మత్తడి దూకుతుంది.