చె(చి)త్తశుద్ధి కరువు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:45 AM
అధికారుల ప్రణాళిక లోపం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, నిర్వహణలో నిర్లక్ష్యం.. వెరసి నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయల స్మార్ట్‌సిటీ నిధులు వృఽథాగా మారాయి.
- రూ.3 కోట్లతో 20 అండర్ బిన్స్ కొనుగోలు
- మూడేళ్లు తిరగకుండానే మూలనపడ్డ బిన్స్
- అధికారుల ప్రణాళికా లోపంతో ప్రజాధనం దుర్వినియోగం
కరీంనగర్ టౌన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అధికారుల ప్రణాళిక లోపం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, నిర్వహణలో నిర్లక్ష్యం.. వెరసి నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయల స్మార్ట్‌సిటీ నిధులు వృఽథాగా మారాయి. కరీంనగర్‌ను క్లీన్ సిటీగా మార్చేందుకు కోట్లాది రూపాయలతో కంప్యాటర్ వాహనం, అండర్ బిన్స్, డంపర్ బిన్స్ కొనుగోలు చేశారు. పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను పోగు చేసే డంపర్ బిన్స్ స్థానాల్లో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్‌ను ఏర్పాటు చేయాలని గత పాలకవర్గం నిర్ణయించింది. అందులో భాగంగా స్మార్ట్‌సిటీ నిధుల నుంచి సుమారు మూడు కోట్లతో పది ప్రాంతాల్లో రెండు చొప్పున 20 అండర్ బిన్స్, వీటి నుంచి చెత్త సేకరణకు ప్రత్యేకంగా కంప్యాటర్ వాహనాన్ని కొనుగోలు చేశారు.
ఫ సెన్సార్లు బిగించకుండానే..
అండర్ బిన్స్ పనులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ బిన్స్‌ను ఏర్పాటు చేసి సెన్సార్ సిస్టమ్‌ను బిగించాలి. ఈ విధానం ద్వారా బిన్స్ పూర్తిగా నిండిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం వెళ్తుంది. 10 చోట్ల ఏర్పాటు చేయాల్సిన బిన్స్‌ను ఎనిమిది చోట్ల ఏర్పాటు చేశారు. మిగిలిన బిన్స్‌ను బిగించకుండానే మూలన పడేశారు. ఏర్పాటు చేసిన ఎనిమిది బిన్స్‌కు సెన్సార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయలేదు. సంబంధిత కాంట్రాక్టర్ పనులన్నీ పూర్తయినట్లు పేర్కొని పూర్తి బిల్లులు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు మూడు కోట్లతో ఏర్పాటు చేసిన అండర్ బిన్స్‌ను అధికారుల పట్టింపుచుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. అండర్ బిన్స్‌ను వినియోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. సెన్సార్ సిస్టమ్ లేకుండా చైతన్యపురి, సప్తగిరికాలనీలో ఏర్పాటు చేసిన అండర్ బిన్స్‌లో నిండిన చెత్తను మాత్రం తొలగిస్తున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించలేని పరిస్థితి. ఇక మిగిలిన ఆరు ప్రాంతాల్లో అసలు వాటిని వినియోగించకుండా వదిలివేశారు. అండర్ బిన్స్‌ను ఏర్పాటు చేసి కొద్దిరోజులపాటు కంప్యాటర్ వాహనం ద్వారా వీటిలోని చెత్తను తొలగించారు. రోజులో ఒక్కసారి మాత్రమే ఇందులోని చెత్తను తొలగించడంతో ఈ బిన్స్ నిండిపోయి పరిసరాలు చెత్తచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో చెత్త సేకరణ పూర్తిగా ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చేపడుతున్నారు. మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు మూలనపడుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టు సంస్థతో బిన్స్‌కు సెన్సార్‌ను అమర్చడంతోపాటు నిరుపయోగంగా మూలనపడేసిన బిన్స్ వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
---------------