అభ్యంతరాల వెల్లువ
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:39 AM
నగరపాలక సంస్థ అధికారులు విడుదల చేసిన 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది.
- ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు
- దిద్దుబాటులో అధికారులు
కరీంనగర్ టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ అధికారులు విడుదల చేసిన 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. అనేక తప్పులతో కూడిన ఓటరు జాబితాను విడుదల చేయడంతో ఆశావహులు ఆందోళనకు గురువుతున్నారు. దాదాపు అన్ని డివిజన్లకు సంబంధించిన ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయని, వీటిని సరిదిద్దకుంటే తమకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఒక డివిజన్‌లోని ఓటర్ల పేర్లను మరో డివిజన్లలో చేర్చడంతో రిజర్వేషన్లు కూడా తారుమారు అయ్యే అవకాశాలుంటాయని ఆందోళన చెందుతున్నారు. కొన్ని డివిజన్లలో పోటీచేసేందుకు గత కొన్నాళ్లుగా ముందుకెళ్తున్న వారి పేర్లు, వారి కుటుంబసభ్యుల పేర్లు, ఆయా ప్రాంతాల్లోని చాలా మంది ఓటర్ల పేర్లను తొలగించడంతో నిరాశకు గురవుతున్నారు. ఓటరు కార్డు కలిగి ఉండి అనేకసార్లు ఓట్లు వేసిన ప్రజల పేర్లు కూడా లేవని, అభ్యంతరాలకు అవకాశమిచ్చి వాటిని సవరిస్తామని అధికారులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. చాలా మంది ఓటర్లు నేరుగా వారికి సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఓటరు జాబితా చూసి ఓటు హక్కును వినియోగించుకోవడం అలవాటుగా ఉంటుందని, అలాంటి వారి పేర్లను తొలగించారనే విమర్శలు వస్తున్నాయి.
ఫ ఆశావహుల్లో ఆందోళన
మరోవైపు కార్పొరేటర్లుగా పోటీచేయాలనుకునే ఆశావహులు ఒక్కో ఇంటిని పరిశీలిస్తూ తప్పులను మార్కింగ్ చేసుకొని ఇతర డివిజన్ల ఓట్లను, ఇతర గ్రామాల ఓట్లను చూసి ఖంగుతింటున్నారు. ఆశావహులు చాలా మంది ఇంటింటికి వెళ్లి వారి పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించడం లేదని చెబుతూ వారి నుంచి అభ్యంతరాలతో కూడిన ఫిర్యాదు చేయించేందుకు డివిజన్లలో తిరుగుతుండగా కొంత మంది ఓటర్లు తమ పేర్లు ఎలా తొలగిస్తారని, ఇది కావాలని మా పేర్లు తీసేయించారని గొడవ చేస్తున్నారని చెబుతున్నారు. ఏ ఎన్నికలు నిర్వహించినా ఎలక్షన్ కమిషన్ ముందుగా విడుదల చేసే ముసాయిదా ఓటరు జాబితాలో కొద్దిపాటి లోపాలు, తప్పులు జరుగడం సహజం, వాటిపై అభ్యంత రాలు ఇవ్వడంతో సవరించి అనర్హుల పేర్లను తొలగించడం, అర్హుల పేర్లను చేర్చడం అన్నది జరుగు తుంది. అయితే తాజాగా నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసిన ముసాయిదా జాబితాలో చాలా మేరకు తప్పులు దొర్లాయనే విమర్శలు వస్తున్నాయి.
- కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్..
మరోవైపు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఓటరు జాబితాలోని అభ్యంతరాలను పరిశీలించి, సవరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు శుక్రవారం నలుగురు ఫిర్యాదు చేయగా, రెండవ రోజు శనివారం మరో 49 మంది ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ గడువు ఉండడంతో సోమవారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నగరపాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితాపై బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పులను సవరించి తుది జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నెల 10వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి తుదిజాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. దీనితో తప్పులను సవరించి తుది జాబితా అప్పటి వరకు రూపొందిస్తారో లేదో వేచి చూడాలి.