దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:56 AM
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 10వ తరగతి చదవిన వారిని మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే వారు. ఈసారి మాత్రం ఇంటర్మీడియెట్ అర్హత ఉండాలనే నిబంధనతో నోటిఫికేషన్ ఇచ్చారు.
జగిత్యాల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 10వ తరగతి చదవిన వారిని మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే వారు. ఈసారి మాత్రం ఇంటర్మీడియెట్ అర్హత ఉండాలనే నిబంధనతో నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా జిల్లాలో 64 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు గాను 1,199 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క టీచర్ పోస్టుకు 18 నుంచి 19 మంది పోటీ పడుతున్నారు.
ఫఇంటర్మీడియెట్ అర్హతతో...
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతను కనీస విద్యార్హతగా నిర్ణయించడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కావడం, స్థానికంగానే విధులు నిర్వహించే అవకాశం ఉండటంతో ఈ పోస్టులకు మహిళల నుంచి ఆసక్తి పెరిగింది. టీచర్ పోస్టుకు ఇంటర్మీడియెట్ అర్హత పెట్టారు. అంతేకాకుండా ఇంటర్ మార్కులకు 70 శాతం మెరిట్, 10 శాతం ఇంటర్వ్యూ, 5 శాతం దివ్యాంగులు, 10 శాతం అనాథలు, 5 శాతం ఎక్స్ సర్వీస్ గల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక నిబంధన పెట్టారు.
ఫఈసారి కొత్త నిబంధన..
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు సగటున 18 నుంచి 19 మంది వరకు పోటీ నెలకొంది. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండగా, దరఖాస్తుదారుల సంఖ్య భారీగా ఉండటంతో ఎంపిక ప్రక్రియపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్వ్యూతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంటర్మీడియెట్ మెరిట్ మార్కులతో పాటు ఇంటర్వ్యూ, అనాథలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ కుటుంబీకులకు ప్రాధాన్యత పెట్టడంతో కొందరు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇంటర్వ్యూ పేరుతో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.
ఫమెరిట్‌పైనే ఆశలు..
అర్హత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక జరిగే అవకాశం ఉండటంతో దరఖాస్తుదారులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో పోస్టుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడతుండడంతో ఒక్క మార్కు తేడా కూడా ఎంపికలో కీలకంగా మారనుంది. అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టడానికి సిద్ధమవుతున్నామంటున్నారు.
ఫరేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్...
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సంబంధిత సీడీపీవో, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు పనివేళల్లో హాజరై, తమ దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత గడువులోగా ధ్రువీకరణ పత్రాలను సమర్పించని అభ్యర్థుల దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవని అధికారులు ప్రకటించారు.
ఫకొలువులు ఇప్పిస్తామని దళారుల రంగ ప్రవేశం
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకపోవడం దళారులకు పెద్ద అస్త్రంగా మారింది. ఇంటర్మీడియెట్ పాటు కమిటీ ఇచ్చే ఇంటర్వ్యూ మార్కులే కీలకం కానున్నాయి. డీఎస్‌సీ సభ్యులతో అదనపు మార్కులు వేయించి కొలువ ఖాయం చేయిస్తామంటూ ఆశావహులను మభ్యపెట్టే ప్రయత్నాలను దళారులు చేస్తున్నారు. అవసరమైతే ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సు చేయించి ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగ మహిళల నుంచి కొంత మంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడ్వాన్స్‌గా సగం ముట్టజెపితే ప్రక్రియ ప్రారంభిస్తామని, ఆర్డర్ కాపీ చేతికి వచ్చాక మిగిలిన సొమ్ము ఇవ్వవచ్చు అంటూ నమ్మబలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో నిజమైన అర్హులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పారదర్శకంగా పోస్టుల భర్తీ
-ఆడెపు భాస్కర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా అంగన్‌వాడీల్లో టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేస్తాం. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడానికి షెడ్యూల్ తయారుచేశాం. త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి సెంటర్ పరిధిలో స్థానికంగా ఉన్న దరఖాస్తుదారులను పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దు.
---------------------------------------------------------------------------------
ప్రాజెక్టు పేరు - పోస్టుల సంఖ్య - వచ్చిన దరఖాస్తులు
---------------------------------------------------------------------------------
ధర్మపురి - 16 - 293
జగిత్యాల - 22 - 521
మల్యాల - 12 - 136
మెట్‌పల్లి - 14 - 249
---------------------------------------------------------------------------------
మొత్తం - 64 - 1,199
---------------------------------------------------------------------------------