Share News

చదువుల పండగ

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:00 AM

వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పండగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.

చదువుల పండగ

- పాఠశాలల పునఃప్రారంభం

- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గులాబీ పువ్వులతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

- పాఠ్య పుస్తకాలు.. నోట్‌బుక్కుల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పండగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సోమవారం అమవాస్య కావడంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలకు బుధవారం వరకు సెలవులు ప్రకటించగా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా తెరుచుకున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు విద్యాసంవత్సరం తొలిరోజున అమవాస్య కావడంతో సెంటిమెంట్‌గా భావించి తమ పిల్లలను పాఠశాలలకు పంపించక పోవడంతో విద్యార్థుల హాజరు తగ్గింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలను ముస్తాబు చేసి పండగ వాతావరణం కల్పించారు. ఉపాధ్యాయులు వెల్‌కమ్‌ డే నిర్వహిస్తూ పాఠశాలలకు వచ్చే తల్లిదండ్రులు, విద్యార్థులకు పేరెంట్స్‌ కమిటీ సభ్యులతో కలిసి ఉపాధ్యాయులు పాఠశాల ప్రధాన ద్వారం వద్ద గులాబీ పువ్వులను అందిస్తూ స్వాగతం పలకడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు సంబంధిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు ఉదయమే పాఠశాలలకు రాగా వారికి స్వాగతం పలికారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో సందడి నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొత్తంగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం పండుగ వాతావరణంలో జరిగింది.

ఫ సమస్యల స్వాగతం...

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి బడీడు, బడిమానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని, పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతమివ్వగా కొంత మంది ఉపాధ్యాయులు శ్రమదానంతో చిన్నచిన్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. స్కావెంజర్లను నియమించక పోవడంతో చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

ఫ పాఠ్యపుస్తకాల పంపిణీ

బడిబాట.. మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్‌, బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి యాదగిరి సునీల్‌రావు 42వ డివిజన్‌ పరిధిలోని భగత్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు ఘనస్వాగతం పలికారు. 49వ డివిజన్‌లో కురుమవాడ ప్రభుత్వ ఉన్నతపాఠశాల (రాంనగర్‌)లో పాఠశాల పునః ప్రారంభకార్యక్రమానికి కార్పొరేటర్‌ ఎన్నం లక్ష్మి హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భద్రయ్య, ఉపాధ్యాయులు నాగేశ్వర్‌రావు, చంద్రకళ, శోభారాణి, రమాదేవి, ప్రభాకర్‌రెడ్డి, మంజు, గాయత్రీదేవి పాల్గొన్నారు. 62వ డివిజన్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ధన్గర్‌వాడీ)లో కార్పొరేటర్‌ పెద్దపల్లి శ్రీలేఖ, మాజీ కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌ పాల్గొని పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులను పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ చేశారు.

Updated Date - Jun 16 , 2026 | 01:01 AM