Share News

పుడమిపై పులకించిన పూల జాతర

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:23 AM

పుడమిపై పూల జాతర పులకరించింది. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం జిల్లాలో మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. పూలను దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే బతుకమ్మలతో కూడళ్లు కొత్త శోభ సంతరించకున్నాయి.

పుడమిపై పులకించిన పూల జాతర
ఓదెలలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళా మణులు

- ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

- ఆనందోత్సాహాల మధ్య

ఆడపడుచుల ఆటాపాట

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): పుడమిపై పూల జాతర పులకరించింది. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం జిల్లాలో మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. పూలను దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే బతుకమ్మలతో కూడళ్లు కొత్త శోభ సంతరించకున్నాయి. ఉదయం నుంచే మహిళలు తంగేడు, గునుగు తదితర రంగు రంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం సంప్రదాయ దుస్తులో మహిళలు గ్రామంలోని ప్రదాన కూడళ్ల వద్దకు చేరుకుని బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ప్రధాన కూడలి వద్ద డీజే సౌండ్‌ సిస్టంతో పాటు విద్యుత్‌ దీపాలంకరణ చేపట్టారు. బతుకమ్మల రంగులు, విద్యుత్‌ దీపాల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గ్రామ శివారులోని చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుక లు మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను చాటుతూ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

జిల్లా కేంద్రంలోని హనుమాన్‌, కోదండ రామాలయం, శివాలయం, ఆర్యవైశ్య భవనం, జెండా కూడలి, ప్రగతి నగర్‌, భూంనగర్‌ తదితర వీధులతోపాటు ఎల్లమ్మ చెరువు ట్యాంకుబండ్‌ పై బతుకమ్మ ఘాటు విద్యుత్‌ కాంతులు వెలుగులు పండుగ శోభను తలపింపజేశాయి. ఉదయం నుండే ఆడబిడ్డలు కొత్త బట్టలు కట్టుకొని పేర్చిన బతుకమ్మలు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆయా కాలనీల నుండి ప్రధాన కూడల్లోకి ట్యాంక్‌ బండ్‌ పైకి బతుకమ్మలన్నీ తీసుకొచ్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సిహెచ్‌ విజయ రమణారావు మున్సిపల్‌, చైర్మన్‌ నూగుల మల్లయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ దాసరి మమతారెడ్డి ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ప్రజలకు మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బతుకమ్మలను ఎల్లమ్మ చెరువు గుండమ్మ చెరువులలో నిమజ్జనం చేయించి సత్తుపిండిలతో వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు.. పోయిరా బతుకమ్మ పోయి రావమ్మా అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను సాగనంపారు.

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): మండలవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను మహిళలు అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. కోలాటాలు, పాటలతో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వెంట తెచ్చుకున్న సత్తులను పంచుకుంటూ ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి) : మండలంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామాల్లోని పలు కూడళ్లలో సంబరాలు నిర్వహించారు. కొలనూర్‌లో వరి,నెమలి పించాలతో తయారుచేసిన బతుకమ్మ ఆకర్షణగా నిలిచింది. ఓదెలలో కాగితపు పూలతో తయారు చేసిన బతుకమ్మతో పాటు మహిళలు పోటీపడి పేర్చిన బతుకమ్మల అలంకరణ వేడుకలకు హైలెట్‌గా నిలిచాయి. సర్పంచులు వేడుక స్థలాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. చెరువులు, కుంటల వద్ద బతుకమ్మలను ప్రశాంతంగా నిమజ్జనం చేశారు. డీజే బతుకమ్మ పాటలు, దాండియా ఆట,పాటలతో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల వద్ద సర్పంచ్‌లు విద్యుత్‌ దీపాల అలంకరణ చేశారు. ఆటపాటల అనంతరం ఆయా ప్రధాన చెరువులు, కుంటలు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, సత్తుపిండితో వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

జూలపల్లి, (ఆంద్రజ్యోతి) జూలపల్లి మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు. కూడళ్లలో మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. పోయిరావమ్మ బతుకమ్మ మా బతుకులను కష్టాలను తీర్చి కరునించవమ్మ బతుకమ్మ అంటు పాటలు పాడి పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నారు. హుస్సేమినియావాగు, చెరువులు,కుంటలు పలు స్థలాల వద్ద నిమజ్జనం చేశారు. సర్పంచులు, కార్యదర్శులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, ఆయన సతీమణి, కూతురు వైష్ణవి, కుమారుడు గోపికృష్ణలు బతుకమ్మను ఇంటి నుండి తీసుకెళ్లి బతుకమ్మ వేడుకలను శివపల్లిలో ప్రారంభించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆయా ప్రధాన చెరువులు, కుంటలు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, సత్తుపిండితో వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ మండిగ రేణుక రాజనర్సు, మాజీ జడ్పీటిసి పడాల తార పర్శరాములుగౌడ్‌, మాజీ ఎంపిపి తానిపర్తి స్రవంతి మోహన్‌రావు, కవ్వంపల్లి లక్ష్మిదుర్గయ్య, కాంపల్లి విజయ ప్రభాకర్‌, సర్పంచ్‌లు మద్దెల రమాదేవి, దుగ్యాలవాణి, రాధాగంగ జమున, రామిడి శైలజ, గోపు రజితలు పాల్గొని బతుకమ్మను ఆడారు.

Updated Date - Oct 19 , 2026 | 01:23 AM